ఉన్నత విద్యతోనే దేశ ప్రగతి: ఏయూ వీసీ గొల్లపల్లి
- 16 Views
- February 18, 2017
- Home Slider రాష్ట్రీయం
ఉన్నత విద్యాభ్యాసంతోనే దేశ ప్రగతి సాధ్యమని ఆంధ్రాయూనివర్సిటీ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు అన్నారు. శనివారం కళాభారతిలో భాష్యం విద్యా సంస్థల ద్వారకానగర్, ఎంవీపీ బ్రాంచిల పదవ తరగతి విద్యార్ధుల వీడ్కోలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఏయూ వీసీ నాగేశ్వరరావుతో పాటు సెంచురియన్ యూనివర్సిటీ వీసీ ఆచార్య జిఎస్ఎన్ రాజులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్ధునుద్దేశించి వీరు కీలకోపాన్యాసం చేశారు. ప్రతి ఒక్కరూ కష్టపడి విద్యాభ్యాసం సాగిస్తే తద్వారా మెరుగైన ఫలితాలను సాధించడానికి అవకాశం కలుగుతుందన్నారు. ఉన్నత విద్యతో ప్రపంచంలో కోరుకున్న ఉపాధి అవకాశాలను స్వంతం చేసుకోవచ్చునన్నారు. ప్రస్తుతం దేశంలో విద్యా సంస్థలకు ఎక్కడా లోటులేదని, అందుకు తగ్గట్టుగానే వాటిని సద్వినియోగం చేసుకొని మెరుగైన ఫలితాలను సాధించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క విద్యార్ధి దేశం గర్వించే స్థాయికి ఎదగాలని చిన్నారులను ఆశీర్వదించారు. విద్యార్ధులంతా పదవ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులతో విజయం సాధించాలని వీరు ఆకాంక్షించారు. గౌరవ అతిధిగా హాజరైన వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ఒక్క విజయం స్వంతం చేసుకుంటే, అ తరువాత అనేక విజయాలు సాధించడానికి దోహదం పడుతుందన్నారు. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్ధి ఏమి సాధించాలన్నా, అందుకు విద్యే ప్రధానమన్నారు. భాష్యం విద్యా సంస్థల సిఇఓ సత్యం మాట్లాడుతూ, తమ డైరెక్టర్ రామకృష్ణ అహోరాత్రులు శ్రమించి విద్యార్ధులను ఉన్నత స్థాయిలో నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అందుకు తగ్గట్టుగానే బాష్యం విద్యార్ధులు అన్ని తరగతుల్లోనూ మెరుగైన ఫలితాలను సాధిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో భాష్యం జోనల్ ఇన్చార్జి ఆంజనేయులు, ద్వారకానగర్ బ్రాంచి ప్రిన్సిపల్ కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన పలు సంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. ఆయా రంగాల్లో ప్రతిభ పాటవాలు చూపిన విద్యార్ధులకు అతిధుల చేతులు మీదుగా బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అతిధులను ఘనంగా సత్కరించారు.


