ఉపాధి నైపుణ్యాల శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి: ఏయూ వీసీ
- 14 Views
- February 18, 2017
- Home Slider రాష్ట్రీయం
ఆంధ్రవిశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల విద్యార్థులకు ప్రత్యేకంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణను అందిస్తున్నామని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు అన్నారు. శనివారం ఉదయం ఏయూ ఆర్ట్స్ కళాశాల సమావేశ మందిరంలో నిర్వహించిన నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ క్యాంపస్‌లోని ప్రతీ విద్యార్థికి ఇటువంటి శిక్షణ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పిస్తామన్నారు. విభాగాల వారీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్మార్థులు ఆత్మావలోకనం చేసుకుంటూ తమ ప్రతిభను మెరుగు పరచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.కోర్సు పూర్తిచేసిన సమయానికి ఉపాధిని అందించే దిశగా పనిచేస్తున్నామన్నారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె.గాయత్రీ దేవి మాట్లాడుతూ ప్రైవేటు రంగంలో ఉపాధిని అందుకోవడానికి సాఫ్ట్‌స్కిల్స్ ఎంతో ఉపయుక్తంగా నిలుస్తోందన్నారు. సాఫ్ట్‌స్కిల్స్ శిక్షకుడు చల్లా క్రిష్ణవీర్ అభిషేక్ మాట్లాడుతూ మాతృభాషపై పట్టు సాధిస్తే పరభాషలో పట్టు సాధించడం ఎంతో సులభమవుతుందన్నారు. మానసిక స్థైర్యం, భావ ప్రకటన నైపుణ్యం, సాఫ్ట్‌స్కిల్స్, ప్రెజెంటేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ నైపుణ్యాలు, యోగా, మెడిటేషన్‌తో జ్ఞాపకశక్తిని పెంపొందించే విభిన్న అంశాలను బోధించడం జరిగిందన్నారు. అసిస్టెంట్ ప్రిన్సిపాల్ ఆచార్య బెన్ని మాట్లాడుతూ కొత్త ఆలోచనలో స్వేచ్చగా పనిచేయాలన్నారు. వ్యక్తిత్వం మానసిక పరిణితికి సంబంధించిన అంశమన్నారు. కార్యక్రమంలో ఆచార్య పి.బాబి వర్ధన్, డాక్టర్ శ్రీమన్నారాయణ, డాక్టర్ శాంతి,సాయిబాల, రహిమున్సీసా, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం శిక్షణ పూర్తిచేసుకున్న విద్యార్థులకు యోగ్యతా పత్రాలను ప్రధానం చేశారు.


