జోరందుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
- 20 Views
- February 18, 2017
- Home Slider రాష్ట్రీయం
ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. తమ అభ్యర్థుల విజయాన్ని కోరుతూ పార్టీలు, కార్యకర్తలు, అభిమానులు ర్యాలీలతో జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజక వర్గం నుంచి పీడీఎఫ్ అభ్యర్థిగా రెండుసార్లు విజయం సాధించిన ఎంవీఎస్.శర్మ స్థానంలో ఈసారి కార్మిక నాయకుడు అజాశర్మ పోటీలో నిలిచారు. అటు కార్మిక వర్గాలలోనూ, ఇటు ఉపాధ్యాయ, యువతలోనూ అజాశర్మకు మంచి పట్టు ఉండటంతో.. మరోసారి గెలుపు తనదే అంటున్నారు పీడీఎఫ్ నాయకులు. అజా శర్మ గతంలో ఉత్తరాంధ్ర అభివృద్ది వేదిక కార్యదర్శిగా పనిచేశారు. ఆ సమయంలో ఉత్తరాంధ్రలో ఉన్న సమస్యలపై పాదయాత్ర కూడా చేశారు. ఆజాశర్మకు 210 సంఘాలు మద్దతు ప్రకటించాయి. దీంతో అందరికంటే ముందుగా నామినేషన్ వేసిన అజాశర్మ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అటు నిన్నటిదాకా ఎవరిని బరిలోకి దించాలన్న దానిపై వివాదాలకు దిగిన టీడీపీ, బీజేపీలు ఎట్టకేలకు ఒక అవగాహనకు వచ్చాయి. ఎమ్మెల్సీగా బీజీపీ అభ్యర్థికి అవకాశం ఇచ్చి భవిష్యత్తులో జరగనున్న గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి సహకరించేలా రెండుపార్టీలు అంగీకారానికి వచ్చాయి. దీంతో బీజేపీ నేత పీవీ మాధవ్‌కు సీటు కేటాయించడంతో ఆయన ఆలస్యంగా ప్రచారంలోకి దిగారు. మరోవైపు, వామపక్షాలు బలపరుస్తున్న పీడీఎఫ్ అభ్యర్థి, ఇంకోవైపు టీడీపీ బలపరుస్తున్న బీజేపీ అభ్యర్థి రంగంలో ఉండటంతో ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే రెండుసార్లు గెలిచిన స్థానాన్ని నిలబెట్టుకోడానికి పీడీఎఫ్-ఇతర ప్రజాసంఘాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇక ఆలస్యంగా బరిలోకి దిగిన టీడీపీ-బీజేపీ అభ్యర్థి విశాఖ నగరంలోని కళాశాలల యాజమాన్యాల ద్వారా ఇప్పటికే పలు ఓట్లను నమోదు చేయించారు. మొత్తం లక్షా అరవై వేల పట్టబద్రుల ఓట్లు ఉత్తరాంధ్ర మూడు జిల్లాల పరిధిలో ఉన్నాయి. వీటిలో అత్యధిక భాగం విశాఖ నగరంలోనే ఉండటంతో అందరు అభ్యర్థులు విశాఖపైనే ఎక్కువగా దృష్టిపెట్టి ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రేస్ పార్టీకూడా విజయనగరం డీసీసీ అద్యక్షుడిగా ఉన్న యడ్ల ఆదిరాజును తమ అభ్యర్ధిగా రంగంలోకి దించింది. ఇదిలావుంటే ఈసారి ఉత్తరాంధ్ర పట్టబద్రుల ఎమ్మెల్సీ బరిలో ఎక్కువగా స్వతంత్ర అభ్యర్థులే ఉన్నారు. వారిలో ‘సంచలన వార్తా పత్రిక లీడర్’ ఎడిటర్ వి.వి. రమణమూర్తి తన విజయం కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇక, ఇంతవరకు తమ అభ్యర్ధిని ప్రకటించని వైసీపీ స్వతంత్రులకు మద్దతు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఎన్నికల కోసం ఉత్తరాంధ్ర జిల్లాల అధికార యంత్రంగా ఏర్పాట్లు పూర్తి చేసింది. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల పనితీరుపై ఈ ఎన్నికలు రెఫరెండం అని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. అటు కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ-టీడీపీలు తమ అభ్యర్థి గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. దీంతో ఎమ్మెల్సీ పోరు పోటా పోటిగా సాగే అవకాశం ఉంది.


