పళనిస్వామిదే పీఠం!
- 12 Views
- February 18, 2017
- Home Slider జాతీయం
మొత్తానికి తమిళనాడు శాసనసభలో పళనిస్వామికే మెజారిటీ సభ్యులు పట్టంకట్టారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్యే ముఖ్యమంత్రి పళనిస్వామి తన బలాన్ని నిరూపించుకున్నారు. ఓటింగ్ అనంతరం శాసనసభ స్పీకర్ ధన్పాల్ పళనిస్వామి విజయాన్ని ప్రకటించి గవర్నర్‌కు నివేదించారు. వాయిదాకి ముందు సభలో డీఎంకే సభ్యుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన స్పీకర్ ధన్ పాల్ వారిని సభ నుంచి బహిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో మరింత గందరగోళం నెలకొంది. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి డీఎంకే నేతలు ఆందోళన తెలిపారు. సభను ఖాళీ చేయాలని వారికి స్పీకర్ పదేపదే సూచించినా ఫలితం లేకపోయింది. స్పీకర్ మాటలు వినిపించుకోని డీఎంకే ఎమ్మెల్యేలు ఒక సందర్భంలో మరింత రెచ్చిపోయారు. సభలోనే నిరసనకు దిగి ఎన్నడూ లేని విధంగా గందరగోళం సృష్టించారు. డీఎంకే సభ్యులను సభ నుంచి బహిష్కరించిన తరువాత వారంతా స్పీకర్ పోడియం వద్దకు దూసుకొచ్చి విధ్వంసం సృష్టించారు. కొందరు డీఎంకే ఎమ్మెల్యేలు శాసనసభలో బెంచీలు ఎక్కి మరీ నిరసన తెలిపారు. పరిస్థితులు సద్దుమణగని కారణం గానే ధన్ పాల్ సభను తొలుత శనివారం మధ్యాహ్నం 3 గంటల వరకూ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే రహస్య ఓటింగ్ జరపాల్సిందేనని డీఎంకే ఎమ్మెల్యేలు నినాదాలతో హోరెత్తించారు. కాగా, అత్యంత నాటకీయ పరిణామాల మధ్య జరిగిన బల పరీక్షలో పళనిస్వామికి అనుకూలంగా 122 మంది సభ్యులు మద్దతు తెలపడంతో పళనిస్వామి బలపరీక్షలో విజయం సాధించినట్టు స్పీకర్ ధన్పాల్ ప్రకటించారు. సభలో డీఎంకే సభ్యులు సృష్టించిన విధ్వంసంతో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో రెండోసారి వాయిదా పడిన రాష్ట్ర శాసనసభ సమావేశం మళ్లీ ఈ మధ్యాహ్నం 3 గంటలకు సమావేశమైంది. అయితే, రహస్య ఓటింగ్ చేపట్టాలని పట్టుబడుతూ ప్రధాన పతిపక్షం డీఎంకే సభ్యులు సృష్టించిన విధ్వంసంపై ఆగ్రహించిన స్పీకర్ ధన్పాల్ వారిని సభ నుంచి సస్పెండ్ చేశారు. సభ తిరిగి ప్రారంభం కాగానే డివిజన్ ఓటింగ్‌ను నిరసిస్తూ కాంగ్రెస్, ముస్లింలీగ్ సభ్యులు కూడా సభనుంచి వాకౌట్ చేశారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన డివిజన్ ఓటింగ్‌లో 122 మంది ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయగా, పన్నీర్ వర్గానికి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేక ఓటు వేశారు. దీంతో పళనిస్వామి ఓటింగ్‌లో పాసైనట్టు స్పీకర్ వెల్లడించారు. ఇదిలావుండగా, బలపరీక్ష సందర్భంగా తీవ్ర గందరగోళం ఏర్పడింది. అది నిజంగానే ఎవరి బలం ఎంత ఉందో నిరూపించుకునేలా మారింది. రహస్య ఓటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్న డీఎంకే ఎమ్మెల్యేలు ఏకంగా స్పీకర్ ధనపాల్ మీదకు కుర్చీలు విసిరేశారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. ఆయన ఎదురుగా ఉన్న కుర్చీని విరగ్గొట్టి, మైక్రోఫోన్లు కూడా విరిచేశారు. ఆయన టేబుల్ కూడా విరగ్గొట్టే ప్రయత్నం చేశారు. ఆయన మీదకు ముందుగా కాగితాలు విసిరేశారు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం రహస్య ఓటింగ్ నిర్వహించడానికి వీల్లేదని స్పీకర్ ధనపాల్ చెప్పడంతో డీఎంకే ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సభలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సభను వాయిదా వేసి స్పీకర్ సభ నుంచి బయటకు వచ్చేశారు. అంతలో స్పీకర్ తీరుకు నిరసనగా డీఎంకే ఎమ్మెల్యే కు కా సెల్వం నేరుగా వెళ్లి స్పీకర్ కుర్చీలో కూర్చున్నారు. మరోవైపు, ప్రజాభిప్రాయం విన్న తర్వాతే ఓటింగ్ నిర్వహించాలని మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, ప్రతిపక్ష నేత, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ డిమాండ్ చేశారు. రహస్య పద్ధతిలో ఓటింగ్ నిర్వహించాలని ఇద్దరూ అసెంబ్లీ స్పీకర్ ధనపాల్‌ను కోరారు. అయితే, స్పీకర్ వీరి డిమాండ్‌ను తిరస్కరిస్తూ డివిజన్ వారీగా ఓటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో స్టాలిన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పళనిస్వామి బలనిరూపణకు గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు 15 రోజులు సమయం ఇచ్చారని, ఎందుకు హడావుడిగా ఓటింగ్ నిర్వహిస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. బలపరీక్షను మరోరోజుకు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. రహస్య పద్ధతిలో ఓటింగ్ నిర్వహిస్తేనే ప్రజాస్వామ్యానికి రక్షని స్టాలిన్ చెప్పారు. సభలో పన్నీరు సెల్వం మాట్లాడుతూ కువతూర్‌లోని గోల్డెన్ బే రిసార్ట్‌లో ఎమ్మెల్యేలను ఉంచిన విషయం అందరికీ తెలుసునని, ప్రజాభిప్రాయం విన్న తర్వాతే ఓటింగ్ నిర్వహించాలని కోరారు. రహస్య పద్ధతిలో ఓటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆయన సభలో నిరసనకు దిగారు. స్పీకర్ రహస్య ఓటింగ్‌ను తిరస్కరించడంపై స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటింగ్ ప్రక్రియను అడ్డుకునేందుకు డీఎంకే, పన్నీరు సెల్వం వర్గీయులు ప్రయత్నించారు. కాంగ్రెస్ పార్టీ,ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) కూడా రహస్య ఓటింగ్‌కు పట్టుపట్టాయి. అంతకముందు, పన్నీర్ సెల్వం వర్గానికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని, అలాగే రహస్య ఓటింగ్ నిర్వహించాలని పన్నీర్ సెల్వం వర్గంతో పాటు డీఎంకే, కాంగ్రెస్, ముస్లింలీగ్ కూడా డిమాండ్ చేశాయి. అయితే పళనిస్వామి వర్గం మాత్రం బహిరంగ ఓటింగుకే పట్టుబట్టింది. స్పీకర్ ధనపాల్ తొలుత మూజువాణీ ఓటింగు చేపట్టి, తర్వాత డివిజన్ ఓటింగ్ చేపట్టారు. దాన్ని బహిరంగ పద్ధతిలో నిర్వహించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ తలుపులు మూసేశారు. కాగా, పళనిస్వామి బలపరీక్ష సందర్భంగా సభ్యులు ప్రవర్తించిన తీరుపై స్పీకర్ ధనపాల్ అసంతృప్తిని, ఆవేదనను వ్యక్తం చేశారు. తన చొక్కా చింపి అవమానించారని, తనపై జరిగిన దానిపై ఎవరికి ఫిర్యాదు చేయాలని స్పీకర్ వ్యాఖ్యానించారు. రాజ్యంగబద్ధంగా అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహిస్తున్నానని చెప్పారు. తన నిర్ణయంపై ఇతరులు జోక్యం చేసుకోరాదని స్పష్టం చేశారు. రహస్య ఓటింగ్ నిర్వహించాలన్న డిమాండ్‌ను తిరస్కరించినందుకు డీఎంకే సభ్యులు స్పీకర్‌ను ఘొరావ్ చేశారు. ఓటింగ్ ప్రక్రియను అడ్డుకుంటూ స్పీకర్‌పై కుర్చీలు, పేపర్లు విసిరేసి, ఆయన ముందున్న టేబుల్‌ను విరగొట్టారు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం ఒంటిగంటకు వాయిదా వేశారు. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత స్పీకర్ డీఎంకే సభ్యులు బయటకు వెళ్లాలని ఆదేశించారు. సభలో మళ్లీ గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సభను 3 గంటలకు వాయిదా వేశారు. మొత్తానికి విశ్వాస పరీక్ష సందర్భంగా తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సభలో ఎప్పుడూ కనీ వినీ ఎరుగని రీతిలో సంఘటనలు చోటుచేసుకున్నాయి. స్పీకర్ ధనపాల్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడిన తర్వాత డీఎంకే సభ్యులు కొందరు ఆయనను తోసేసే ప్రయత్నం కూడా చేశారు. దాంతో ఆయన మార్షల్స్ సాయంతో జాగ్రత్తగా సభ నుంచి బయటకు వెళ్లారు. ఈ సమయంలో ఇద్దరు డీఎంకే ఎమ్మెల్యేలు స్పీకర్ కుర్చీలో కూడా కూర్చున్నారు. డీఎంకేకు చెందిన కుకా సెల్వం, రంగనాథన్ అనే ఇద్దరు ఎమ్మెల్యేలు ఇలా కూర్చున్నారు. ఈ పరిస్థితి ఇంతవరకు దేశంలో ఎక్కడా చోటుచేసుకున్న దాఖలాలు లేవు. స్పీకర్ కుర్చీలో ప్రతిపక్ష సభ్యులు కూర్చోవడం, అది కూడా అధికారికంగా కాకుండా అనధికారికంగా గొడవ చేసి, స్పీకర్‌ను పంపేసి ఆయన స్థానంలో ఒక నిమిషం కంటే కూడా తక్కువ సేపు కూర్చోవడం ఎప్పుడూ లేదు. తమిళనాడు అసెంబ్లీ మాత్రమే ఈ ఘటనకు అద్దం పట్టింది.


