మహాజన పాదయాత్ర చారిత్రాత్మకమైనది: కారత్
- 13 Views
- February 18, 2017
- Home Slider జాతీయం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేపట్టిన మహాజన పాదయాత్ర చారిత్రాత్మకమైనదని సీపీఎం పోలిట్‌బ్యూరో సభ్యుడు, పార్టీ పూర్వ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాష్‌కారత్ అన్నారు. శనివారం ఖమ్మం నగరంలోని బోస్‌బొమ్మ సెంటర్లో బండారు యాకయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాదయాత్ర బృందం సభ్యులను అభినందించారు. స్వాతంత్య్రం వచ్చి 70ఏళ్లు గడుస్తున్నా అభివృద్ధి మాత్రం కనిపించడం లేదని, అది కొంతమంది వద్దే కేంద్రీకృతమై ఉందన్నారు. బడ్జెట్లో అన్ని వర్గాలకు సమాన కేటాయింపులు జరగట్లేదని అందుకే పాదయాత్ర అనివార్యంగా మారిందన్నారు. ఆర్థికాభివృద్ధిలో అందరినీ భాగస్వాములను చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రజలు తమ హక్కులకోసం పోరాడాలని పిలుపునిచ్చారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. 2003సంవత్సరంలో తాను చేపట్టిన మహాప్రస్థానం పాదయాత్ర ఫలితంగా దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకం రూపుదిద్దుకుందని, 2012లో చేసిన సైకిల్ యాత్ర ఫలితంగా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం చేసిందని ఇది సీపీఎం విజయం అని పేర్కొన్నారు. సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా నేడు మహాజన పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు, జిల్లా నాయకులు నున్నా నాగేశ్వరరావు, వై. విక్రం, సమీన, సరళ, తదితరులు పాల్గొన్నారు.


