మోదీపై జుకర్‌బర్గ్ ప్రశంసల జల్లు
- 7 Views
- February 18, 2017
- Home Slider అంతర్జాతీయం
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రఖ్యాత సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రజలు, ప్రజా ప్రతినిధుల మధ్య జవాబుదారీతనాన్ని పెంచేందుకు మోదీ ప్రభుత్వం ఫేస్‌బుక్‌ను వినియోగించుకుంటున్న తీరు అభినందనీయమన్నారు. ‘బిల్డింగ్ గ్లోబల్ కమ్యూనిటీ’ పేరుతో 200 కోట్ల మంది ఫేస్బుక్ వినియోగదారులనుఉద్దేశిస్తూ రాసిన పోస్టులో ‘ఎన్నికల్లో గెలిచాక చేతులు దులుపుకోవటం కాదు. ఐదేళ్లపాటు వారితో నేరుగా అనుసంధానమై ఉండాలి. అదే ప్రజలు, ప్రజాప్రతినిధుల మధ్య జవాబుదారీగా మారుతుంది. మోదీ తన మంత్రులకు సమావేశాల వివరాలు, ఇతర సమాచారం ఫేస్బుక్ ద్వారా ప్రజలకు చేరాలని కోరారు’ అని ప్రశంసించారు. ఇదిలావుండగా, వలసలపై మరో నిషేధ ఉత్తర్వు జారీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమయ్యారు. ఏడు ముస్లిం ఆధిక్య దేశాల నుంచి పౌరుల రాకను అడ్డుకునేలా వచ్చే వారంలో కొత్త కార్యనిర్వాహక ఉత్తర్వుల్ని జారీ చేస్తామని మరోమారు ఆయన ప్రకటించారు. పాత ఉత్తర్వుల్లో మార్పులు చేసి ఆదేశాలు జారీ చేస్తామని వైట్‌హౌస్‌లో మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా కోర్టు నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ‘అది చాలా తప్పుడు నిర్ణయం. దేశ భద్రత, రక్షణకు ప్రమాదకరమైంది. కొత్త ఉత్తర్వులు చాలా పక్కాగా ఉంటాయి. అమెరికాకు వచ్చేవారిని చాలా క్షుణ్నంగా తనిఖీ చేయబోతున్నాం’ తెలిపారు. కాగా, ట్రంప్ నిషేధ ఉత్తర్వులపై తొమ్మిదో సర్క్యూట్ అప్పీలు కోర్టు ఇచ్చిన తీర్పును అమెరికా న్యాయశాఖ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ట్రంప్ ఉత్తర్వుల అమలును పునరుద్ధరించాలంటూ సుప్రీంకు విజ్ఞప్తి చేసింది. ట్రంప్ ఉత్తర్వులపై కోర్టు పోరాటంలో కీలకంగా వ్యవహరించిన వాషింగ్టన్ రాష్ట్ర అటార్నీ జనరల్ బాబ్ ఫెర్గూసన్ మాట్లాడుతూ ‘ట్రంప్ సర్కారు సుప్రీంను ఆశ్రయించడంతో అధ్యక్షుడి కార్యనిర్వాహక ఉత్తర్వులు రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లు స్పష్టమైంది’ అని చెప్పారు. అమెరికాలోని పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన టెక్సస్ వలసల ఉత్తర్వులపై ట్రంప్ నిర్ణయాన్ని సమర్ధించింది. ఆ మేరకు టెక్సస్ అటార్నీ జనరల్ కెన్ పాక్స్టన్ తొమ్మిదో సర్క్యూట్ అప్పీలు కోర్టు న్యాయ శాఖకు మద్దతుగా పిటిషన్ వేశారు. మీడియా పట్ల ట్రంప్ విమర్శలపై ఆస్ట్రేలియా ప్రధాని టర్న్‌బుల్‌ను ఆసక్తికరంగా స్పందించారు. న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘బ్రిటన్ మాజీ ప్రధాని విన్ స్టన్ చర్చిల్ ఒకసారి ఏమన్నారంటే రాజకీయ నాయకులు వార్తపత్రికల గురించి ఫిర్యాదు చేయడమంటే సముద్రం గురించి నావికుడు ఫిర్యాదు చేయడమే’ అని పేర్కొన్నారు. మీడియాను విమర్శిస్తూ ట్రంప్ సమయం వృథా చేసుకుంటున్నారని చెప్పారు.


