మోసపోయిన ప్రజలు వదలరు: పన్నీర్
- 9 Views
- February 18, 2017
- Home Slider జాతీయం
తమిళనాడు అసెంబ్లీలో తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు, నాటకీయ పరిణామాల మధ్య జరిగిన బలపరీక్షలో ముఖ్యమంత్రి పళనిస్వామి విజయం సాధించడంపై మాజీ సీఎం పన్నీర్‌సెల్వం తనదైన శైలిలో స్పందించారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు వెళితే ప్రజల అభిప్రాయం ఏమిటో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను ఎమ్మెల్యేలు మోసం చేశారన్నారు. తమకూ సమయం వస్తుందని, అంతిమంగా ధర్మమే గెలుస్తుందని తెలిపారు. అవసరమైతే గవర్నర్‌ను కలవనున్నట్టు చెప్పారు. స్పీకర్ ముందు రెండు డిమాండ్లు ఉంచామనీ, ఎమ్మెల్యేలను ఆయా నియోజకవర్గాలకు పంపించాలని కోరినా స్పీకర్ అంగీకరించలేదన్నారు. కాగా, బలపరీక్ష, ఆ తదనంతర పరిణామాలపై డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ గవర్నర్ విద్యాసాగర్‌రావుకు లేఖ రాశారు. డీఎంకే లేకుండా అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించి దొడ్డిదారిలో ముఖ్యమంత్రిని గెలిపించడమే స్పీకర్ అజెండా అని ఆయన లేఖలో దుయ్యబట్టారు. తమిళనాడులో ప్రజాస్వామిక విలువలను కాపాడాలని ఆయన తన లేఖలో కోరారు. బలపరీక్షను వాయిదా వేసి రహస్య ఓటింగ్ ద్వారా నిర్వహించాలని కోరారు. శాసనసభ వేదికగా జరిగిన బలపరీక్ష సందర్భంగా రోజంతా జరిగిన నాటకీయ పరిణామాలలో స్టాలిన్ కేంద్రబిందువుగా నిలిచారు. అసెంబ్లీలో గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో స్టాలిన్‌తో సహా డీఎంకే సభ్యులను మార్షల్స్ బలవంతంగా గెటేంసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన చొక్కా చినిగిపోయింది. దీంతో బొత్తాలు లేని చినిగిన చొక్కాతోనే మొదట గవర్నర్‌ను కలిసిన స్టాలిన్ ఆ వెంటనే మెరీనా బీచ్‌కు వెళ్లి దీక్షకు దిగారు. రోజంతా సాగిన ఈ రాజకీయ డ్రామాలో స్టాలిన్ బాగానే హల్చల్ చేశారు. ఇటు మీడియాలోనూ, ప్రజల దృష్టిలోనూ బలపరీక్ష ఘట్టంలో ఆయన కేంద్రబిందువు అయ్యారు.


