రహస్య ఓటింగ్‌కు పట్టుబడ్డ డీఎంకే సభ్యులు
- 11 Views
- February 18, 2017
- Home Slider జాతీయం
పళనిస్వామి ప్రభుత్వ బలనిరూపణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అసెంబ్లీలో రచ్చ రచ్చ చోటు చేసుకోవటంతో పాటు అసాధారణ సంఘటనలు చోటు చేసుకున్నాయి. పళనిస్వామి ప్రభుత్వ బలనిరూపనణకు డివిజన్ల వారీగా ఎన్నిక నిర్వహించాలని స్పీకర్ ధన్పాల్ తీసుకున్న నిర్ణయాన్ని విపక్ష డిఎంకే సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించడం, రహస్య ఓటింగ్ నిర్వహించాలని పట్టుబట్టారు. అయితే రహస్య ఓటింగ్‌కు స్పీకర్ ససేమిరా అనటంతో డిఎంకే సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసాధారణ పరిణామాలకు తెర తీశారు. స్పీకర్ పోడింను ధ్వంసం చేయడం మొదలు, స్పీకర్ పట్ల అనుచితంగా ప్రవర్తించారు. డిఎంకే ఎమ్మెల్యేలు కొందరు స్పీకర్ జబ్బ పట్టుకొని లాగటం, ఆయన చొక్కా పట్టుకోవడం లాంటి విపరీత పరిణామాలకు తెర తీశారు. దీంతో ఏర్పడిన గందరగోళంతో తొలుత సభను వాయిదా వేసిన స్పీకర్ ఒంటిగంటకు మరోసారి సభను ఏర్పాటు చేశారు. సభ ప్రారంభమైన తర్వాత కూడా సభ్యుల్ని శాంతింప చేయాలని ప్రయత్నించినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. సభ్యులు శాంతంగా ఉండాలంటూ పదే పదే స్పీకర్ కోరినప్పటికీ సభ్యులు మాట వినలేదు. స్పీకర్ పోడియం చుట్టూ చేరి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సభ్యులకు సర్దిచెప్పే ప్రయత్నం చేసిన స్పీకర్ చివరకు డిఎంకే సభ్యులందరిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సస్పెండ్ అయిన సభ్యుల్ని సభ నుంచి పంపేందుకు వీలుగా సభను మధ్యాహ్నం మూడు గంటల వరకు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమయ్యేలోపు సస్పెండ్ అయిన సభ్యులను సభ నుంచి బయటకు పంపేందుకు స్పీకర్ ఆదేశాలు ఇచ్చారు. అంతకముందు, తమిళనాట ఉత్కంఠభరితంగా సాగిన రాజకీయ హైడ్రామా ఎట్టకేలకు అనేక ట్విస్టులతో ముగిసింది. తమిళనాడు అసెంబ్లీ వేదికగా జరిగిన బలపరీక్ష ఘట్టంలోనూ అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. చివరివరకు హైవోల్టేజ్ డ్రామా నడిచింది. శాసనసభలో డీఎంకే సభ్యుల ఆందోళన, రాద్ధాంతం, గలాటా, స్టాలిన్‌తో సహా వారిని బలవంతంగా సభ నుంచి మార్షల్ గెంటివేయడం, ఈ క్రమంలో స్టాలిన్ చొక్కా చినగడం, చినిగిన చొక్కాతోనే నిరసనకు స్టాలిన్ పూనుకోవడం, బలపరీక్ష సందర్భంగా ఇలా రోజంతా తమిళనాడు రాజకీయాలు అట్టుడికిపోయాయి. చివరకు శశికళ వర్గానికి చెందిన పళనిస్వామి విశ్వాసపరీక్షలో నెగ్గి తన సీఎం పీఠాన్ని పదిలం చేసుకున్నారు. అయితే, ఈ తుదిఘట్టంలో పన్నీర్ సెల్వం బలమెంతో తేలిపోయింది. శశికళకు ఎదురుతిరిగి ఆమె గూటిలో ఉన్న ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకొనేందుకు ఓపీఎస్ చివరివరకు ప్రయత్నించినా ఆయనకు మద్దతుగా నిలిచింది కేవలం 11 మందేనని బలపరీక్ష ద్వారా తేలింది. తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా 231 మంది సభ్యులు హాజరయ్యారు. ఇందులో డీఎంకేకు చెందిన 89 మంది సభ్యులపై స్పీకర్ బహిష్కరణ వేటు వేశారు. దీంతో స్పీకర్ నిర్ణయాన్ని నిరసిస్తూ తొమ్మిది మంది కాంగ్రెస్, ముస్లింలీగ్ సభ్యులు వాకౌట్ చేశారు. దీంతో సభలో మిగిలింది 133 మంది సభ్యులు. ఇందులో 122 మంది పళనిస్వామికి మద్దతుగా విశ్వాసపరీక్షకు అనుకూలంగా ఓటేయగా 11 మంది మాత్రమే వ్యతిరేకంగా ఓటేశారు. అంటే దాదాపు రెండువారాలపాటు రాజకీయ హైడ్రామాను నడిపిన పన్నీర్ సెల్వానికి చివరివరకు మద్దతు పలికింది కేవలం ఈ 11 మందే అని చెప్పవచ్చు.


