ఆస్కార్ సందడి
- 10 Views
- February 27, 2017
- Home Slider అంతర్జాతీయం
లాస్ఏంజిల్స్: ఆస్కార్ వేడుకలకు కొందరు సెలబ్రిటీలు బ్లూ రిబ్బన్ ధరించి వచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏడు ముస్లిం దేశాల ప్రజలను దేశంలోకి రాకుండా అడ్డుకునేందుకు జారీ చేసిన ‘ప్రయాణ నిషేధ’ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ ప్రముఖులు బ్లూ రిబ్బన్ పెట్టుకుని వచ్చారు. అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్(ఏసీఎల్యూ)కు మద్దతిస్తూ వారు రిబ్బన్ ధరించారు.
ఐరిష్-ఇథోపియన్ స్టార్ రూత్ నెగ్గా, మూన్లైట్ సినిమా డైరెక్టర్ బెర్రీ జెంకిన్స్ సహా మరికొందరు ప్రముఖులు కెర్లీ క్లోస్, కాసీ అఫ్లెక్, మెంజ్ పాసెక్, లిన్-మానుయెల్ మిరిండా తదితరులు బ్లూ రిబ్బన్‌తో కనిపించారు. అకాడమీ అవార్డుల కార్యక్రమ వ్యాఖ్యాత జిమ్మీ కిమ్మెల్ కూడా ట్రంప్‌పై తన వ్యతిరేకతను వేదికపైనే చూపించారు. దాదాపు కార్యక్రమం ప్రారంభమై రెండు గంటలవుతోంది ఆయన ఇంకా ఏం ట్వీట్ చేయలేదు, నాకు ఆందోళనగా ఉంది అంటూ ట్రంప్ తరచూ ట్వీట్లు చేసే అలవాటును గుర్తుచేస్తూ జిమ్మీ వ్యాఖ్యానించారు.
వేదికపై ఉండగానే మధ్యలో జిమ్మీ ఫోన్ తీసుకుని ‘హే డొనాల్డ్ ట్రంప్ యు అప్?’ అని ట్వీట్ చేశారు. అంతేకాకుండా ప్రొడక్షన్ బృందాన్ని తన ఫోన్ స్క్రీన్‌ను అందరికీ కనిపించేలా చేయమని కోరారు. దీంతో జిమ్మీ ఫోన్లో ట్వీట్ స్క్రీన్‌పై అందరికీ కనిపించింది. దీంతో చాలా మంది గట్టిగా నవ్వారు. అలాగే ట్రంప్ పాలసీలను వ్యతిరేకించిన నటి మెరిల్ స్ట్రీప్‌ను గతంలో ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. అయితే మెరిల్‌కు మద్దతుగా జిమ్మీ ‘మెరిల్ సేస్ హాయ్’ హ్యాష్‌ట్యాగ్‌ను కూడా ట్వీట్ చేశారు. జిమ్మీ ట్వీట్‌ను అయిదు నిమిషాల్లోనే లక్ష మంది రీట్వీట్ చేశారు.


