హాస్య నటుడు తవక్కల కన్నుమూత
- 19 Views
- February 27, 2017
- Home Slider సినిమా
చెన్నై: దర్శకుడు భారతిరాజా నటించిన ‘ముందానై ముడిచ్చు’ చిత్రం ద్వారా హాస్య నటుడిగా పరిచయమమైన చిట్టిబాబు అలియాస్ తవక్కల (42) అనారోగ్యంతో కన్నుమూశారు. వడపళనిలోని ఆదిమూల పెరుమాల్ ఆలయ వీధిలో ఉన్న ఆయన ఇంటిలో ఆదివారం ఉదయం తవక్కల మృతి చెందారు. ఆయనకు భార్య పొదుమణి ఉన్నారు. 1983లో సినిమాల్లోకి వచ్చిన తవక్కల ఆ తర్వాత తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ తదితర భాషల్లో 496 చిత్రాలలో నటించారు. బుల్లితెర ధారావాహికల్లో నటించడంతోపాటు పలు కార్యక్రమాలనూ చేశారు. తవక్కల సొంత వూరు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు. అక్కడ ఆయన తల్లి, చెల్లెలు ఉంటున్నారని సమాచారం.
ఇప్పటి వరకు తమిళంలో 67 సినిమాల్లో నటించిన ఆయన ప్రస్తుతం ధారావాహికలు చేస్తున్నారు. ఈ స్థితిలో శుక్రవారం ఒక షూటింగ్ నిమిత్తం కేరళకు వెళ్లిన తవక్కల శనివారం రాత్రి ఇంటికి తిరిగి వచ్చారు. ఎప్పటిలానే ఆదివారం ఉదయం మేల్కొన్నారు. అకస్మాత్తుగా వాంతులు అయ్యాయి. కాసేపటికే ఆయన మృతి చెందారని ఆయన స్నేహితులు తెలిపారు. భౌతికకాయానికి పలువురు సినీ ప్రముఖులు, నటులు పూల మాల వేసి నివాళులర్పించారు. అంత్యక్రియలు సోమవారం ఉదయం 10 గంటలకు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.


