-రికార్డు నెలకొల్పిన మహిళా వ్యోమగామి పెగ్గీవిట్సన్
వాషింగ్టన్: అంతరిక్షంలో అత్యధిక రోజులపాటు (534 రోజులకుపైగా) గడిపిన వ్యక్తిగా అమెరికా మహిళా వ్యోమగామి పెగ్గీ విట్సన్ రికార్డు సృష్టించారు. ఇప్పటివరకూ ఈ రికార్డు అమెరికాకే చెందిన వ్యోమగామి జెఫ్విలియమ్స్ పేరిట ఉంది. ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో 534 రోజులు గడిపారు. దీనిని పెగ్గీవిట్సన్( 57 ) సోమవారం అధిగమించారు. అంతేకాదు.. ఐఎస్ఎస్లో ఆమె మరో ఐదునెలలపాటు (సెప్టెంబర్ వరకు) ఉండనున్నారు. గడువు ముగిసిన తర్వాత భూమి మీదికి తిరిగి వచ్చినప్పుడు.. ఐఎస్ఎస్లో 650 రోజులకుపైగా ఉన్న వ్యోమగామిగా ఆమె చరిత్ర సృష్టించనున్నారు. ఆమె ఇప్పటికే పలు రికార్డులను నెలకొల్పారు.
2008లో ఐఎస్ఎస్కు సారథ్యం వహించిన తొలి మహిళగా చరిత్రకెక్కిన పెగ్గీవిట్సన్.. ఈనెల 9న రెండోసారి ఆ బాధ్యతలను చేపట్టారు. ఈ విధంగా రెండుసార్లు ఐఎస్ఎస్కు నేతృత్వం వహించిన మహిళ ఆమె ఒక్కరే. రోదసిలో 50 గంటల 40 నిమిషాల వ్యవధిలో ఏడు స్పేస్‌వాక్‌లను నిర్వహించిన తొలి మహిళా వ్యోమగామి, భారతీయ అమెరికన్ సునీత విలియమ్స్ రికార్డును ఈ ఏడాది మార్చిలో పెగ్గీవిట్సన్ అధిగమించారు. ఆమె ఇప్పటివరకూ 53 గంటలపాటు స్పేస్‌వాక్ జరిపారు. నాసాలో 1980లలో పెగ్గీవిట్సన్ తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు.