ఈ తప్పెవరిది? editorial
కశ్మీరు లోయలో జరుగుతున్న హింసకు ప్రజలు, సైనికులు పిట్టల్లా రాలిపోతున్నారు. స్థానికులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు. దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న హింస నేటికీ చల్లారలేదు. ఇది అంతం కాదు..ఆరంభంలా ఉంది. ఏ రోజుకు ఆరోజే కొత్త సమస్యతో లోయ అట్టుడిగిపోతోంది. దీనికి బాధ్యులు ఎవరు? ఈ తప్పెవరిదీ? ఈ రెండింటికి సమాధానం ఉండదు. దేశ సరిహద్దులు, వాస్తవాధీన రేఖ వెంబడే కాకుండా వేర్పాటువాదులు కశ్మీరు లోయలోకి చొరబడ్డారు. ప్రజలకు ఎంత నష్టం చేయాలో అంతా చేస్తున్నారు. ఈ విషయాన్ని ఉద్యమకారులు గ్రహించుకోలేకపోతున్నారు. లోయలో ఉద్యమకారులు మరొకరి ఆధీనంలోకి వెళ్లిపోయారు. ఎవరో రిమోట్ నొక్కితే వీరు యాక్షన్‌లోకి వస్తున్నారు. వారెందుకు ఆందోళన చెస్తున్నారో వారికే అర్ధం కాని పరిస్థితి చోటు చేసుకుంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ లోయలో అసంతృప్తి సెగలు వస్తూనే ఉన్నాయి. కశ్మీరుపై కన్నేసిన పాకిస్తాన్ ఎలాగైనా ఈ ప్రాంతాన్ని సొంతం చేసుకోవాలని కలలు కంటూనే ఉంది. ఈ క్రమంలో మూడు యుద్ధాలు కూడా చేసింది. ప్రతి యుద్ధంలోనూ చావు దెబ్బతింటూనే ఉంది. ఇక చేసేది లేక అంతర్గత కల్లోలానికి తెర తీసింది. కశ్మీరులోని కొన్ని వర్గాలకు తనకు అనుకూలంగా మలచుకుంది. తాను చెప్పినట్టు నడిచే విధంగా వ్యవస్థను తయారు చేసుకుంది. కశ్మీరులో అశాంతి నెలకొంటే అది తనకు అనుకూలంగా మలచుకోవాలన్నదే పాక్ ఉద్దేశ్యం. దానికి తగ్గట్టుగానే కార్యకలాపాలను కొనసాగిస్తోంది. ఎంతో మంది ప్రజలను, సైనికులను పొట్టన పెట్టుకుంది. పాక్ కవ్వింపు చర్యలకు భారత్ ఏనాడు తొందరపడలేదు. ఒకవేళ అదే జరిగితే పరిస్థితి పరిస్థితి ఇంకోలా ఉండేది. అది జరగకే ఇంత విధ్వంసాన్ని చూడాల్సి వస్తోంది. భారత్ శాంతి స్వభావాన్ని చేతకాని తనంగా పాకిస్తాన్ భావిస్తోంది. పాక్‌ను అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా భారత్ ఏనాడో నిలబెట్టింది. అయినా ఆ దేశంలో చలనం లేదు. సంచలనాలు సృష్టించాలనే ఉద్దేశ్యంతో లోయలో అల్లర్లకు ప్రేరేపిస్తోంది. అమాయక ప్రజలు వేర్పాటువాదుల మాటలను నమ్మి ఆందోళనలు చేస్తూ బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు శాంతి చర్చలు జరుపుతున్నా ఫలితం మాత్రం ఉండటం లేదు. లోయలో అలజడలకు ప్రధాన కారణంగా హురియత్ కాన్ఫరెన్స్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక్కటే కాదు చాలా సంస్థలు పాకిస్తాన్‌కు అనుకూలంగా పని చేస్తున్నాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు నాటి ప్రధాని అటల్ బిహార్ వాజ్‌పేయి, ఉప ప్రధాని లాల్‌కిషన్ అద్వానీ హురియత్ కాన్ఫరెన్స్ నేతలతో చర్చలు జరిపారు. అవి కొంత మేరకు ఫలించాయి. వారు ఎక్కడైతే ఆపేశారో అక్కడ నుంచి చర్చలు కొనసాగించాలని ప్రస్తుత ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ భారత ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. గడచిన నెల రోజులుగా లోయలో పరిస్థితి దారుణంగా ఉంది. అల్లర మూకలు భద్రతా దళాలపై రాళ్లు రువ్వుతూ హింసకు పాల్పడుతున్నారు. పాఠశాలలకు శెలవులు ప్రకటించారు. ముఖ్య కార్యాలయాలు మినహా దాదాపు అన్నీ మూత పడ్డాయి. జన జీవనం స్థంబించిపోయింది. కశ్మీరులో రాష్ట్రపతి పాలన విధించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ క్రమంలో సీఎం ముఫ్తీ ప్రధానితో బేఠీ అయి పరిస్థితి వివరించారు. చర్చలే ఏకైక మార్గమని ప్రధానికి సూచించారు. వాజ్‌పేయి విధానం ఘర్షణలు కాదు…సయోధ్య. కశ్మీరు అంశంలో ఆయన అడుగుజాడల్లో నడుస్తాం అని మోదీ పేర్కొన్నారు. కశ్మీరు లోయలో శాంతి స్థాపనకు ప్రధాని మోదీ ఉత్సాహం చూపిస్తున్నారు. అందుకే సీఎం ముఫ్తీ ప్రతిపాదనకు ఆయన అంగీకరించారు. కశ్మీరు ప్రజలను రక్షించుకునేందుకు ఎంత కిందకు దిగమన్నా ప్రధాని దిగడానికి సిద్దంగా ఉన్నారన్నది సుస్పష్టం. లోయలో సాధారణ పరిస్థితులు నెలకొన్న తరువాత ఆందోళకారులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ప్రధాన ప్రకటించారు. భారత్ ఎల్లవేళల శాంతిని కోరుకుంటోంది. అదే స్థాయిలో వేర్పాటువాదులు, పాకిస్థాన్ సుముఖుంగా ఉంటేనే సాధ్యమవుతుంది. లేదంటే దీనికి అంతం ఉండదు. ఆరంభమే అవుతుంది.


