ఎండలోకి వస్తే చర్మంపై పొక్కులు.. వాతావరణశాఖ హెచ్చరిక
- 20 Views
- admin
- April 25, 2017
- రాష్ట్రీయం స్థానికం
హైదరాబాద్: సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల తీవ్రత మూడు రెట్ల వరకూ అధికంగా ఉంటుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు బయట తిరగకుంటే మంచిదని వాతావరణ శాఖ హెచ్చరించింది. సాధారణంగా సూర్యరశ్మిలో 3 నుంచి 5 శాతం వరకూ బ్లూరేస్ ఉంటాయని, కానీ వాతావరణ మార్పుల నేపథ్యంలో మంగళ, బుధవారాల్లో బ్లూ రేస్ 11 శాతం దాటుతాయని తెలిపింది. దీని ప్రభావం సాయంత్రం అయిదు గంటల వరకూ ఉంటుందని పేర్కొంది. ఈ కిరణాల ధాటికి చర్మంపై పొక్కులు వచ్చే ప్రమాదం ఉందని, వడదెబ్బ బారిన పడవచ్చని హెచ్చరించింది. మధ్యాహ్నం వేళ ఎండల్లో తిరగవద్దని, తప్పనిసరైన పరిస్థితుల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ఈ వేసవి కష్టమే సీఎం
అమరావతి: వచ్చే నెలలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వడదెబ్బ తగలకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలు, నరేగా పనుల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచాలని ఆయన అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, సీనియర్ అధికారులు, ప్రజా ప్రతినిధులతో సీఎం చంద్రబాబు మంగళవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, ప్రజారోగ్యంపై మాట్లాడారు. ప్రధానకూడళ్లలో ప్రజలకు తాగునీరు, మజ్జిగ పంపిణీకి ఏర్పాట్లు చేయాలని చెప్పారు. అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని అన్నారు. ఆరోగ్య ఖర్చులు ప్రతి కుటుంబానికి మోయరాని భారంగా మారుతున్నాయని, ఆరోగ్యంపై ఖర్చులు తగ్గించడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పలు అంశాలపై దష్టి పెట్టిందని చెప్పారు. ఎన్టీఆర్ వైద్యసేవ, ఆరోగ్యరక్ష, ఉచిత క్లినికల్ టెస్ట్లు, సీఎం ఆరోగ్య కేంద్రాలు వంటి పలు పథకాలు అమలు చేస్తున్నామని, అందరికీ ఆరోగ్యం సమకూరితే రాష్ట్రమంతా ఆనందమేనని ఆయన వ్యాఖ్యానించారు. ఎండల తీవ్రత దష్ట్యా వడదెబ్బ నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని చంద్రబాబు నాయుడు సూచించారు.


