మరాఠాల పోరులో పుణెదే పైచేయి. లీగ్‌లో వరుసగా ఆరు విజయాలతో జోరుమీదున్న ముంబైపై మరోసారి ఆధిపత్యం ప్రదర్శిస్తూ వాంఖడేలో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ విజయఢంకా మోగించింది. భారీ లక్ష్యాన్ని నిర్దేశించకపోయినా, బెన్ స్టోక్స్ అద్భుత బౌలింగ్‌తో రోహిత్ సేనను కట్టడిచేసింది.
ముంబై: ఆద్భుత విజయాలతో మంచి ఊపుమీదున్న ముంబైని వారి సొంతగడ్డపైనే పుణె మట్టికరిపించింది. సోమవారం ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో పుణె 3 పరుగుల తేడాతో గెలిచింది. పుణె నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యఛేదనలో ముంబై 20 ఓవర్లలో 157/8 స్కోరుకే పరిమితమైంది. కెప్టెన్ రోహిత్(39 బంతుల్లో 58; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీతో పోరాడినా ఫలితం లేకపోయింది. ఉనద్కత్(2/40), స్టోక్స్(2/21) చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పుణె.. ఓపెనర్లు రాహుల్ త్రిపాఠి(31 బంతుల్లో 45; 3ఫోర్లు, 2సిక్స్‌లు), రహానే (32 బంతుల్లో 38; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులు చేసింది. కర్ణ్‌శర్మ, బుమ్రాలకు చెరో రెండు వికెట్లు దక్కాయి. స్టోక్స్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.
రోహిత్ కెప్టెన్ ఇన్నింగ్స్:
ముంబై ఇన్నింగ్స్‌లో సహచరుల నుంచి సహకారం అంతంత మాత్రమైనా రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఓపెనర్లు పార్థివ్ పటేల్ (27 బంతుల్లో 33), బట్లర్(17) బ్యాటింగ్‌తో మెరుగైన శుభారంభం అందించినా..దాన్ని కొనసాగించలేకపోయారు. స్టోక్స్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు పోయి బట్లర్ తొలి వికెట్‌గా వెనుదిరిగితే.. లీగ్‌లో సూపర్ ఫామ్‌మీదున్న రానా(3) కూడా నిరాశపరిచాడు. దీంతో 51 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ (58) బాధ్యాతాయుతమైన ఇన్నింగ్స్‌తో రాణించాడు. ఓవైపు వికెట్లు కోల్పోతున్నా..ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఆఖరి వరకు గెలుపు కోసం పోరాడాడు. ఉనద్కత్ వేసిన చివరి ఓవర్లో ముంబై విజయానికి 17 పరుగులు అవసరమైన దశలో తొలి బంతికే హార్దిక్ పాండ్యా(13) ఔటయ్యాడు. ఆ మరుసటి బంతిని రోహిత్ భారీ సిక్స్‌గా మలిచాడు. కానీ బంతి తేడాతో ఉనద్కత్కే రోహిత్ రిటర్న్ క్యాచ్ ఇవ్వడంతో మ్యాచ్ పుణె వైపు మొగ్గింది. ఆరో బంతికి హర్భజన్ సిక్స్ కొట్టినా లాభం లేకపోయింది.