విద్యుత్ సంస్కరణలతో ప్రజలపై భారం
- 18 Views
- admin
- April 25, 2017
- రాష్ట్రీయం స్థానికం
పనికి రాని అణు విద్యుత్ కేంద్రం ఎందుకు?
అమెరికా కంపెనీలకు ఇండియా సబ్సిడీలా?
ప్రమాదం జరిగితే నష్టాన్ని ఉహించలేం
ఢిల్లీ సైన్సు ఫోరం వ్యవస్ధాపకులు ప్రబీర్ పురకాయస్థ
విజయనగరం ఫీచర్స్ ఇండియా : విద్యుత్ సంస్కరణలతో ప్రజలపై భారాలు పెరిగాయని ఢిల్లీ సైన్సు ఫోరం వ్యవస్ధాపకులు ప్రబీర్ పురకాయస్థ అన్నారు. కొవ్వాడలో అణువిద్యుత్ ప్లాంట్ ఏర్పాటు, విద్యుత్ సంస్కరణలు దేశానికి లాభమా?, నష్టమా? అన్న అంశాలపై గురజాడ అధ్యయన వేదిక ఆధ్వర్యంలో పట్టణంలోని ఎన్జిఒ హోంలో జెవివి జిల్లా ప్రధాన కార్యదర్శి రమణప్రభాత్ అధ్యక్షతన అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రబీర్ పురకాయస్థ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. అణువిద్యుత్ ఉత్పత్తికి ఎక్కువగా ఖర్చు అవుతుందన్నారు. ఇతర దేశాల్లో విఫలమైన, ఇక్కడ పరీక్షించని ఆరు అణు రియాక్టర్లు కొవ్వాడలో ఏర్పాటుచేస్తున్నారు. వీటివల్ల ఏదైనా ప్రమాదం జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేమని అన్నారు. జపాన్లో వేసిన అణు బాంబులతో జరిగిన నష్టం కంటే అనేక రెట్లు ఎక్కువని చెప్పారు. ఈ అణు విద్యుత్ కేంద్రాన్ని తొలుత గుజరాత్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారని, అక్కడ మత్స్యకారులు తీవ్రంగా వ్యతిరేకించడంతో కొవ్వాడకు మార్చారని తెలిపారు. నష్టాల్లో ఉన్న, అనుభవంలేని అమెరికాకు చెందిన వెస్టింగ్ హౌస్కు అప్పగించారని విమర్శించారు. అణు విద్యుత్ ఉత్పత్తి అత్యంత ఖరీదన్నారు. ఇటాస్, వెస్టింగ్హౌస్ కంపెనీలకు భారత ప్రభుత్వం ఎందుకు సబ్సిడీని భరిస్తుందని ప్రశ్నించారు. అణురియార్టర్లకు ఎటువంటి ప్రమాదం జరిగిన ఆమెరికాలోని బీమా కంపెనీలకు సంబంధంలేదని, భారతదేశానికి చెందిన ఇన్సూరెన్స్ కంపెనీలే ఆ భారం భరించాలని నిబంధనల్లో ఉందన్నారు. అమెరికాలో ఎందుకూ పనినిరాని వాటిని తెచ్చి ఇండియాలో ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. అణురియాక్టర్ల ద్వారా తయారు చేసే విద్యుత్ ఉత్పత్తికి అవసరమయ్యే మూడో స్టేజ్ ప్లాటినియం ఖనిజం భారతదేశంలో దొరకదన్నారు. దీంతో ఇతర దేశాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉండాలని వివరించారు. చైనాలో 2012లో ప్రారంభించిన అణు విద్యుత్ కేంద్రం ఇంకా తయారు కాలేదన్నారు. విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చిన రాష్ట్రాల్లో ఎక్కువ రేట్లకు విద్యుత్ అందిస్తున్నారన్నారు. విద్యుత్ సంస్కరణలు తీసుకురాని కేరళ, హిమాచల్ ప్రదేశ్లో విద్యుత్ రేట్లు తక్కువగా ఉన్నాయన్నారు. కేంద్ర విద్యుత్ శాఖామంత్రి అన్నింటికి సరిపోగా 6500 మోగావాట్ల యూనిట్ల విద్యుత్ అదనంగా ఉందని చెపుతున్నారని, అటువంటప్పుడు కొవ్వాడలో అణువిద్యుత్ కేంద్రం అవసరమా అని ప్రశ్నించారు. ఈ సదస్సులో మాజీ ఎంపి డివిజి శంకరరావు, జెవివి జిల్లా ప్రధాన కార్యదర్శి రమణప్రబాత్, కన్వీనర్ కె.శేషగిరి, కో కన్వీనర్ జె.బంగారం పాల్గొన్నారు.


