‘ఆలౌట్’ చేసి రండి – సీఆర్పీఎఫ్ దళాలకు కేంద్రం ఆదేశాలు
- 8 Views
- admin
- April 26, 2017
- అంతర్జాతీయం జాతీయం
న్యూఢిల్లీ : చత్తీష్ఘడ్లో మూకుమ్మడి దాడి చేసి, 26 మంది జవాన్ల ప్రాణాలను బలిగొన్న మావోయిస్టులను సమూలంగా ఏరి వేసేందుకు కేంద్రం కీలక ఆదేశాలు వెలువరించింది. అడవుల్లోని మావోలపై దాడులు జరిపి ‘ఆలౌట్’ చేయాలని, సాధ్యమైనంత త్వరలోనే ఫలితాలను చూపించాలని హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ నుంచి సీఆర్పీఎఫ్ డీజీ సుదీప్ లఖ్టాకియా, సీనియర్ సెక్యూరిటీ అడ్వయిజర్ కే.విజయ్ కుమార్‌కు ఆదేశాలు అందాయని తెలుస్తోంది. నక్సల్స్‌పై అనుసరిస్తున్న వ్యూహాలను పూర్తిగా మార్చుకోవాలని, వచ్చే రెండున్నర నెలల వ్యవధిలో ఒక్క మావో కూడా కనిపించకుండా చూడాలని ఆయన ఆదేశించినట్టు సమాచారం. ”మీకేం కావాలో చెప్పండి. మరింత మంది జవాన్లు కావాలా? సాంకేతిక సహకారం కావాలా? ఇంకా ఏమైనా ఆయుధాలు కావాలా? ఏదడిగినా మీ ముందు ఉంచుతాను. నాకు మాత్రం ఫలితాలు కనిపించాలి” అని ఆయన గట్టిగా చెప్పినట్టు సీఆర్పీఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. మతులకు నివాళులు అర్పించేందుకు రాయపూర్ వెళ్లిన రాజ్‌నాథ్, ప్రతీకారం తీర్చుకుని తీరుతామని ప్రతిజ్ఞ చేసిన సంగతి తెలిసిందే. వచ్చే నెల ఎనిమిదవ తేదీన దేశంలోని పది మావో ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని ఢిల్లీలో నిర్వహిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు మానవహక్కుల సంఘాల నాయకులపై విరుచుకపడ్డారు. 24 మంది జవాన్లును మావోయిస్టులు దారుణంగా కాల్చి చంపేస్తే వీరెందుకు ఖండించలేదని వెంకయ్య నిలదీశారు. మావోయిస్టులు చనిపోతే నానా రాద్దాంతం చేసే మానవ హక్కుల సంఘాలకు ఈ దారుణం కనిపించలేదా? అని ప్రశ్నించారు. మానవ హక్కుల సంఘాలు ద్వందనీతిని అవలంభిస్తున్నాయని విమర్శించారు. చత్తీష్ఘడ్లో తరుచూ జరుగుతున్న ఈ దాడులకు శాశ్వత పరిష్కారం కోసం కేంద్రం ఆలోచన చేస్తోంది. అందులో భాగంగానే మంత్రి రాజ్‌నాధ్ సింగ్ హెచ్చరికలు జారీ చేశారు.


