సీఆర్పీఎఫ్ బాస్ ఉన్నారా? లేరా?
న్యూఢిల్లీ : గత మార్చినెల నుంచి ఇప్పటివరకు సీఆర్పీఎఫ్ బలగాల మీద రెండు పెద్ద దాడులు జరిగాయి. కానీ ప్రపంచంలోనే అతి పెద్దదైన ఈ పారా మిలటరీ దళానికి రెండు నెలలుగా పర్మినెంట్ బాస్ లేరు. ఇంతకుముందు డైరెక్టర్ జనరల్‌గా ఉన్న కె. దుర్గాప్రసాద్ ఫిబ్రవరి 28న రిటైర్ అయిన తర్వాత ఇంతవరకు సీఆర్పీఎఫ్కు డీజీని నియమించలేదు. దాదాపు రెండు నెలల క్రితం అదనపు డీజీ సుదీప్ లక్టాకియాను తాత్కాలిక డీజీగా నియమించారు. ఆయనే ఈ దళం బాధ్యతలు చూస్తున్నారు. అయితే పూర్తిస్థాయి డీజీ లేకపోవడం వల్లే సుక్మా దాడి జరిగిందన్న ఆరోపణలు సరికావని హోం మంత్రిత్వశాఖ సీనియర్ అధికారులు అంటున్నారు. తాత్కాలిక డీజీ లక్టాకియాకు పూర్తి అధికారాలున్నాయని, అందువల్ల బాస్ లేరన్న కారణంగా సీఆర్పీఎఫ్ పనితీరు విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండబోదని చెప్పారు. కేవలం ఒక్క వ్యక్తి కారణంగా మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోతుందనడం సరికాదని అన్నారు.
దుర్గా ప్రసాద్ రెండు నెలల క్రితమే రిటైర్ అయినా, ఇంతవరకు ఆయన వారసుడిని ఎంపిక చేయకపోవడానికి కేవలం పాలనాపరమైన అడ్డంకులే కారణమని అంటున్నారు. 1984 బ్యాచ్‌కి చెందిన ఐపీఎస్ అధికారి అయిన లక్టాకియాకు ఇంకా డీజీ స్థాయి పదవి దక్కడానికి అవకాశం లేదు. అందుకే ఆయనను తాత్కాలిక డీజీగా నియమించారని, త్వరలోనే ఎంపానల్మెంట్ అయిపోతే.. ఆయన పూర్తిస్థాయి డీజీ అయ్యే అవకాశం ఉందని హోం శాఖ అధికారి ఒకరు తెలిపారు.


