
సియోల్: ఉత్తర కొరియాపై యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే ఇరుదేశాల అధ్యక్షుల సవాళ్లు, ప్రతిసవాళ్లతో వాతావరణం వేడెక్కగా, తాజాగా అమెరికా మరో అడుగు ముందుకు వేసింది. ఉత్తర కొరియా దాయాది దేశమైన దక్షిణ కొరియాలో తన క్షిపణి విధ్వంసక వ్యవస్థ ద టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ (టీహెచ్ఏఏడీ) సిస్టంను ఏర్పాటు చేసే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. సియోంగ్జూ పట్టణానికి ఆరు ట్రక్కుల్లో పరికరాలను తరలించింది. అక్కడి గోల్ఫ్‌కోర్టులో టీహెచ్ఏఏడీని ఏర్పాటు చేయనున్నారు. ఈ వ్యవస్థ శత్రుదేశాలు ప్రయోగించిన భారీ, మధ్యతరహా క్షిపణులను ప్రారంభంలోనే గుర్తించి ధ్వంసం చేస్తుంది. గత ఏడాది దక్షిణ కొరియాతో చేసుకున్న సైనిక సహకార ఒప్పందంలో భాగంగానే పరికరాలను తరలించామని అమెరికా చెప్తున్నది. దక్షిణ కొరియా రక్షణ శాఖ మంత్రి మాట్లాడుతూ.. రక్షణ సామర్థ్యాన్ని పెంచుకునే చర్యల్లో భాగంగా టీహెచ్ఏఏడీ ఏర్పాటు చేస్తున్నామని, ఈ ఏడాది చివరి నాటికి సిద్ధమవుతుందని చెప్పారు. ఇప్పటికే దక్షిణ కొరియా, అమెరికా సంయుక్తంగా సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఉత్తర కొరియాపై ఒత్తిడి పెంచే చర్యల్లో భాగంగానే అమెరికా ఈ చర్యలకు దిగిందని భావిస్తున్నారు.
ఉత్తరకొరియా ఇటీవలే పలు క్షిపణులను పరీక్షించిన నేపథ్యంలో టీహెచ్ఏఏడీని ఏర్పాటు చేస్తున్నదని చెప్తున్నారు. క్షిపణి విధ్వంసక వ్యవస్థ ఏర్పాటుతో తమ రక్షణ వ్యవస్థ బలహీనం అవుతుందని చైనా భయపడుతున్నది. దీంతో అమెరికా చర్యలపై మండిపడింది. ఇలాంటి చర్యలు ఆసియా ప్రాంతంలో రక్షణ రంగ అసమానతలు పెంచుతాయని విమర్శించింది. చైనా ఇప్పటికే దక్షిణ కొరియాపై పలు ఆంక్షలు విధించింది. చైనా పర్యాటకులు వెళ్లకుండా నిషేధం విధించిం ది. కాగా, బుధవారం దక్షిణ కొరియాలోని సియోంగ్జూ పట్టణంలో స్థానికులు అమెరికాకు వ్యతిరేకంగా నిరసన చేపట్టా రు. అమెరికా ట్రక్కులు వస్తున్న సమయంలో ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకొనియుద్ధం వద్దు, అమెరికా నువ్వు స్నేహం చేస్తున్నావా? ఆక్రమిస్తున్నావా? అంటూ నిరసన తెలిపారు. మరోవైపు అమెరికా రక్షణశాఖ అధికారులు బుధవారం వైట్‌హౌస్‌లో సమావేశమయ్యారు. అనంతరం ఉత్తరకొరియా చర్యలను వివరిస్తూ సెనేటర్లందరికీ సందేశం పంపించారు.
చైనా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన యుద్ధవిమాన వాహక నౌకను లియోగింగ్ ప్రావిన్స్‌లోని దలియాన్ డాక్‌యార్డ్‌లో బుధవారం జలప్రవేశం చేయించింది. ఈ నౌక 2020 నాటికి పూర్తిస్థాయిలో సిద్ధం కానున్నది. దక్షిణ చైనా సముద్రజలాలపై పట్టు పెంచుకుకోవడంతోపాటు, ఉత్తర కొరియాపై అమెరికా దూకుడు వైఖరికి సమాధానంగా ఈ నౌకను ప్రారంభించినట్టు నిపుణులు భావిస్తున్నారు.