గోడ కట్టి తీరతా
- 14 Views
- admin
- April 27, 2017
- అంతర్జాతీయం తాజా వార్తలు
న్యూయార్క్: అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో గోడ కట్టితీరతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. భారీ ఖర్చుతో కూడుకున్న ఈ వివాదాస్పద భారీ గోడ నిర్మాణాన్ని తాత్కాలికంగా పక్కనపెట్టేశారన్న వార్తల నేపథ్యంలో అధ్యక్షుడి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. శ్వేతసౌధంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎవరికైనా సందేహాలుంటే తీర్చుకోవాలని.. ఎట్టిపరిస్థితుల్లోనూ గోడ కట్టితీరతామని కుండబద్దలు కొట్టారు. దీని నిర్మాణం ద్వారా మత్తుపదార్థాలు, మనుషుల అక్రమ రవాణాను నిరోధించవచ్చని చెప్పారు. వాస్తవానికి ఇవి ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యలని కానీ వీటిపై ఎవరూ మాట్లాడటం లేదని వ్యాఖ్యానించారు. దాదాపు 3,100 కిలోమీటర్ల గల అమెరికా-మెక్సికో సరిహద్దులో 1600 కిలోమీటర్ల పరిధిలో ఈ గోడ నిర్మించనున్నట్లు ఆయన వెల్లడించారు. గోడ కట్టేందుకు అనేక ప్రాంతాల్లో సాధ్యం కాకపోవడంతో 1600 కి.మీ. మేర నిర్మించనున్నట్టు ఇంజినీరింగ్ వర్గాలు తెలిపాయి. ఇటీవల తనని కలిసిన రక్షణ కార్యదర్శి జాన్ కెల్లీ సైతం కచ్చితంగా ఓ గోడను నిర్మించాల్సిన అవసరం ఉందని చెప్పారని ట్రంప్ వెల్లడించారు. అయితే కొందరు దీనికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుకుంటున్నారో తనకు తెలియదని.. వందశాతం గోడ కట్టితీరతామని ఆయన స్పష్టం చేశారు.


