రూపాయికే బంగారం!
- 27 Views
- admin
- April 27, 2017
- జాతీయం తాజా వార్తలు రాష్ట్రీయం

న్యూదిల్లీ: ప్రముఖ డిజిటల్ వ్యాలెట్ పేటీఎం తన వినియోగదారులకు సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. రాబోయే అక్షయ తృతీయను దృష్టిలో పెట్టుకుని ‘డిజిటల్ గోల్డ్’ పేరుతో తీసుకొచ్చిన ఈ ఆఫర్ ద్వారా అతితక్కువగా రూపాయికి కూడా బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చు. ఎంఎంటీసీ-పీఏఎంపీ సంయుక్తంగా పేటీఎం వేదికగా ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. ఇందులో భాగంగా పేటీఎం మొబైల్ వ్యాలెట్ వినియోగదారులు 24 క్యారెట్ల బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చు. అంతేకాకుండా వినియోగదారుల కోరిక మేరకు బంగారు నాణేలను ఇంటి వద్దకు తీసుకొచ్చి ఇవ్వనున్నారు. మళ్లీ వీటిని ఆన్లైన్లో విక్రయించుకోవచ్చు.
‘భారతీయులు బంగారాన్ని సంప్రదాయ పద్ధతిలో.. అదీ లెక్క ప్రకారం మాత్రమే కొనుగోలు చేస్తారు. మార్కెట్ అనుసంధానమైన ధరలను దృష్టిలో పెట్టుకోరు. ఆ సమయంలో స్వచ్ఛత, భద్రత, దాచుకోవడం తదితర అంశాలకు కొంత రుసుములు చెల్లిస్తుంటారు’ అని ఎంఎంటీసీ-పీఏఎంఈ ఛైర్మన్ మెహదీ భరోద్కర్ అన్నారు. ‘మా భాగస్వామ్యంతో అత్యంత నాణ్యమైన బంగారాన్ని కొనుగోలు చేసుకోవడమే కాకుండా, ఎవరికి తగిన స్థాయిలో వారు బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది’ అన్నారు.
‘భారతీయులు బంగారాన్ని కేవలం మదుపుగా మాత్రమే పరిగణిస్తారు. డిజిటల్ గోల్డ్ ద్వారా పెట్టుబడుల పెట్టేందుకు మా వినియోగదారులకు సులభ మార్గాన్ని తీసుకొచ్చాం. దీని ద్వారా మా వినియోగదారులు అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చు.. లేదా విక్రయించుకోవచ్చు. అతి తక్కువగా రూపాయికి కూడా బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు’ అని పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ తెలిపారు.


