శ్రీలంక భారత్‌ల మధ్య ఆర్థిక ఒప్పందం
- 13 Views
- admin
- April 27, 2017
- అంతర్జాతీయం జాతీయం
దిల్లీ: ఆర్థికపరమైన సంబంధాలను మరింత మెరుగుపరుచుకునేందుకు భారత్, శ్రీలంక ఒప్పందం కుదర్చుకున్నాయి. శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘె, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య విస్తృత స్థాయి చర్చల అనంతరం.. బుధవారం ఈ మేరకు అవగాహన ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. భారత్‌లో పర్యటిస్తున్న విక్రమసింఘెతో.. బుధవారం సమావేశమైన మోదీ ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జాలర్లకు సంబంధించిన అంశాల్లో తీసుకుంటున్న చర్యలను లంక దృష్టికి భారత్ తీసుకువెళ్లినట్లు భారత విదేశాంగశాఖ తెలిపింది. భారత జాలర్ల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరిస్తూ.. సహకారం కొనసాగించాలని శ్రీలంకను కోరినట్లు పేర్కొంది. విక్రమసింఘె గౌరవార్థం మోదీ విందు ఏర్పాటు చేశారు. శ్రీలంకలో వెసాక్ (బుద్ధ పూర్ణిమ) ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా భారత ప్రధానికి విక్రమసింఘె మరోసారి ఆహ్వానం పలికారు. మే రెండో వారంలో కొలంబోలో జరిగే ఈ ఉత్సవాల్లో మోదీ పాల్గొననున్నారు.
ఐస్ ముప్పుపై చర్చలు: దక్షిణాసియాలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాద సంస్థ ముప్పును ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై భారత్, శ్రీలంక చర్చలు జరపనున్నాయి. విక్రమసింఘెతో భారత హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ భేటీ సందర్భంగా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఐఎస్ ముప్పుపై ఇరు దేశాల భద్రత సంస్థల మధ్య సంప్రదింపులు నిరంతరం కొనసాగాలని కోరుకున్నట్లు ఇద్దరు నాయకులూ తెలిపారు.


