అనంతపురంలో ఘోరం.. చెరువులో తెప్ప బోల్తా.. ఒకే కుటుంబానికి చెందిన 13 మంది మృతి..
- 13 Views
- admin
- April 28, 2017
- రాష్ట్రీయం స్థానికం
అనంతపురం: అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం ఎర్రతిమ్మరాజుచెరువు గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. చెరువులో తెప్ప బోల్తాపడిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 13 మంది మృతిచెందారు. మరొకరు గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో తెప్పలో మొత్తం17మంది ప్రయాణిస్తున్నారు. పరిమితికి మించి ప్రయాణించడమే ప్రమాదానికి కారణమైంది. గ్రామంలోని ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరైన వీరంతా విహారం కోసం తెప్పలో ప్రయాణించి ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. మత్స్యకారులను ఒడ్డులోనే వదిలి వీరే తెప్పను నడుపుకుంటూ చెరువులోకి వెళ్లి ప్రమాదానికి గురయ్యారు. మృతుల్లో ఏడుగురు మహిళలు, ఆరుగురు చిన్నారులు ఉన్నారు. ఆచూకీ లభించిన వారిలో ముగ్గురు చిన్నారులు ప్రాణాలతో బయటపడ్డారు. గల్లంతైన బాలుడి ఆచూకీ గుర్తించాల్సి ఉంది. విషయం తెలుసుకున్న గ్రామస్థులు, పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు.
ప్రమాద ఘటనపై సీఎం దిగ్భ్రాంతి: అనంతపురం జిల్లా గుంతకల్లులో జరిగిన తెప్ప బోల్తా ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. వెంటనే సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై కలెక్టర్, ఎస్పీతో మాట్లాడాలని మంత్రి సునీతను ఆదేశించారు.
బాధాకరం: మంత్రి సునీత
గుంతకల్లు ప్రమాద ఘటన బాధాకరమని మంత్రి సునీత అన్నారు. సీఎం ఆదేశాల మేరకు ప్రమాద ఘటనకు సంబంధించి కలెక్టర్ ఎస్పీ, ఉన్నతాధికారులతో మాట్లాడానన్నారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు జరుగుతున్నాయని తెలిపారు.
ఆరా తీసిన మంత్రులు
గుంతకల్లు ప్రమాద ఘటనపై మంత్రులు చినరాజప్ప, కాలవ శ్రీనివాసులు ఆరా తీశారు. ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని మంత్రి చినరాజప్ప ఎస్పీకి సూచించారు. వెలికితీసిన మృతదేహాలకు శవపరీక్షకు తరలించాలని ఎస్పీని ఆదేశించారు. సహాయకచర్యలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతున్నట్లు మంత్రి కాలవ శ్రీనివాసులు తెలిపారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామన్నారు.
సహాయక చర్యల్లో వ్యక్తి మృతి
వైటీ చెరువు గ్రామంలో జరిగిన హృదయవిదారక ఘటనలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రమాద ఘటనలో సహాయక చర్యల్లో పాల్గొన్న ఈతగాడు చంద్రన్న మృతిచెందాడు. మృతదేహాలను వెలికి తీసే సమయంలో గుండెపోటు రావడంతో అతడు మరణించాడు.
గుంతకల్లు మృతులకు ప్రభుత్వ పరిహారం
గుంతకల్లు తెప్ప బోల్తా ఘటనలో మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఆర్థికసాయం ప్రకటించింది. మృతుల్లో పెద్దలకు రూ.3 లక్షలు, పిల్లలకు రూ.లక్ష చొప్పున ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందించనున్నట్లు మంత్రి పరిటాల సునీత తెలిపారు. చంద్రన్న బీమా కింద మరో రూ.5లక్షలు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.


