ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలువాల్సిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు చేతులెత్తేసింది. పేరొందిన పెద్ద స్టార్లందరూ బ్యాటింగ్‌లో తక్కువ స్కోరుకే పరిమితమైతే.. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడంలో అనుభవంలేని బౌలర్లు ఆశలను వమ్ము చేశారు. 9 మ్యాచ్‌ల్లో 6 ఓటములతో ఆర్సీబీ నాకౌట్‌కు దాదాపు దూరమైనట్లే!
బెంగళూరు: పెద్ద ప్రత్యర్థిపై.. చిన్న లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆరోన్ ఫించ్ (34 బంతుల్లో 72; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) పెద్ద ఆట ఆడాడు. చాలాకాలం తర్వాత మునుపటి ఫామ్‌ను చూపెడుతూ చిన్నస్వామిలో ఫోర్లు, సిక్సర్ల మోత మోగిస్తూ ఆర్సీబీ బౌలర్లపై లయన్‌లా విరుచుకుపడ్డాడు. దీంతో గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్ 7 వికెట్ల తేడాతో బెంగళూరుపై గెలిచింది. టాస్ ఓడిన బెంగళూరు 20 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటైంది. పవన్ నేగి (19 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కేదార్ జాదవ్ (18 బంతుల్లో 31, 4 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగతా వారు నిరాశపర్చారు. నాలుగు బంతుల తేడాలో కోహ్లీ (10), గేల్ (8), హెడ్ (0) ఔట్‌కావడంతో ఆర్సీబీ కోలుకోలేకపోయింది. గుజరాత్ బౌలర్ ఆండ్రూ టై (3/12) సూపర్ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు.
ఆదుకుంటాడనుకున్న డివిలియర్స్ (5), జాదవ్ కూడా వరుస విరామాల్లో వెనుదిరగడంతో బెంగళూరు 60 పరుగులకే సగం జట్టు పెవిలియన్‌కు చేరుకుంది. తర్వాత మన్దీప్ (8), నేగి ఆరో వికెట్‌కు 40 పరుగులు జోడించినా.. 14 ఓవర్ నుంచి ఓవర్‌కో వికెట్ చొప్పున పడటంతో ఆర్సీబీ స్కోరు 111/8గా మారింది. చివర్లో అరవింద్ (9), అనికేత్ (15 నాటౌట్) కాస్త పోరాడినా ఆఖరి ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి బెంగళూరును తక్కువ స్కోరుకే ఆలౌట్ చేశారు గుజరాత్ బౌలర్లు. ఆండ్రూ టైకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
ఫించ్ విజృంభణ: తర్వాత గుజరాత్ 13.5 ఓవర్లలో 3 వికెట్లకు 135 పరుగులు చేసి నెగ్గింది. ఇషాన్ కిషన్ (16), మెకల్లమ్ (3) పవర్‌ప్లే ముగియకముందే ఔటైనా.. ఫించ్ పూనకం వచ్చినట్లుగా చెలరేగాడు. రెండో ఎండ్‌లో రైనా (30 బంతుల్లో 34 నాటౌ ట్; 4 ఫోర్లు, 1 సిక్స్) సమయోచితంగా ఆడుతూ సహచరుడికి ఎక్కువగా స్ట్రయికింగ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
దీన్ని ఆసరాగా చేసుకున్న ఫించ్.. బద్రీ, చాహల్, అనికేత్, నేగిలను లక్ష్యంగా చేసుకుని భారీ షాట్లతో రెచ్చిపోయాడు. 9వ ఓవర్లో రెండు ఫోర్లు, ఓ సిక్స్‌తో 19 పరుగులు రాబట్టి కేవలం 22 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేశాడు. 13వ ఓవర్లో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి ఫించ్ ఔటయ్యాడు. రైనాతో కలిసి మూడో వికెట్‌కు కేవలం 8 ఓవర్లలో 90 పరుగులు జత చేశాడు. తర్వాత రైనా రెండు ఫోర్లు, ఓ సిక్స్‌తో 37 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని ఖాయం చేశాడు.
స్కోరు బోర్డు
బెంగళూరు: గేల్ (సి) కార్తీక్ (బి) టై 8, కోహ్లీ (సి) ఫించ్ (బి) బాసిల్ 10, డిలియర్స్ (రనౌట్) 5, హెడ్ (సి) రైనా (బి) టై 0, జాదవ్ (బి) జడేజా 31, మన్దీప్ (సి) జడేజా (బి) టై 8, నేగి (సి) బాసిల్ (బి) అంకిత్ 32, బద్రీ (సి) ఇషాన్ (బి) జడేజా 3, అరవింద్ (సి) మెకల్లమ్ (బి) ఫా ల్క్నర్ 9, అనికేత్ (నాటౌట్) 15, చాహల్ (రనౌట్) 1, ఎక్స్‌ట్రాలు: 12, మొత్తం: 20 ఓవర్లలో 134 ఆలౌట్; వికెట్లపతనం: 1-22, 2-22, 3-22, 4-58, 5-60, 6-100, 7-105, 8-110, 9-133, 10-134; బౌలింగ్: నాథూ సింగ్ 2-0-8-0, బాసిల్ థంపి 4-0-34-1, టై 4-0-12-3, జడేజా 4-0-28-2, అంకిత్ 3-0-28-1, ఫాల్క్‌నర్ 3-0-15-1.
గుజరాత్ : ఇషాన్ కిషన్ ఎల్బీ (బి) బద్రీ 16, మెకల్లమ్ (సి) డివిలియర్స్ (బి) బద్రీ 3, రైనా (నాటౌట్) 34, ఫించ్ (సి) డివిలియర్స్ (బి) నేగి 72, జడేజా (నాటౌట్) 2, ఎక్స్‌ట్రాలు: 8, మొత్తం: 13.5 ఓవర్లలో 135/3; వికెట్లపతనం: 1-18, 2-23, 3-115; బౌలింగ్: బద్రీ 3-0-29-2, అరవింద్ 3-0-19-0, అనికేత్ 2-0-21-0, చాహల్ 3-0-29-0, నేగి 2-0-24-1, హెడ్ 0.5-0-11-0.