నా కలల జట్టు నకిలీ.. గంగూలీ
దిల్లీ : టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ తన ఐపీఎల్ కలల జట్టు ప్రకటించినట్లు నిన్న మీడియాలో వార్తలు వచ్చాయి. అందులో టీమిండియా మాజీ కెప్టెన్ ధోనికి స్థానం లేకపోవడం క్రికెట్ అభిమానుల్లో చర్చకు దారితీసింది. అయితే దీనిపై ఇప్పుడు గంగూలీ స్పందించాడు. అసలు తాను ఎలాంటి కలల జట్టును ప్రకటించలేదని స్పష్టం చేశాడు. అది తన ట్విటర్ అకౌంట్ కాదని పేర్కొన్నాడు.
‘ఇప్పుడే చూశాను.. నా పేరుతో ఉన్న ఐపీఎల్ ఫాంటసీ జట్టుని. అయితే ఇది నా ట్విటర్ అకౌంట్ కాదు.. నా జట్టూ కాదు. నేను ఎలాంటి ఫాంటసీ లీగ్‌లో పాల్గొనను. ఇది పూర్తిగా నకిలీ’ అని గంగూలీ పేర్కొన్నాడు.
ఐపీఎల్ పదో సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో గురువారం గంగూలీ కలల జట్టు ఇదే అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. ఐపీఎల్ ఆడుతున్న క్రికెటర్ల నుంచి రూపొందించినట్లు పేర్కొన్న ఈ జట్టులోధోనికి బదులు దిల్లీకి చెందిన రిషబ్ పంత్‌కు వికెట్ కీపర్‌గా స్థానం కల్పించినట్లు ఉంది. అయితే ఇటీవల ధోని సత్తాపై గంగూలీ అనుమానాలు వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో గంగూలీ పేరుతో వచ్చిన కలల జట్టులో ధోనికి స్థానం లేకపోవడం చర్చకు దారితీసింది.


