పోలీస్ బాస్ ఓకే.. ఈ సింహాలమాటేంటి..?
- 10 Views
- admin
- April 28, 2017
- రాష్ట్రీయం స్థానికం
విజయనగరం ఫీచర్స్ ఇండియా : ఆలోచన బాగున్నా.. ఆచరణ లోప భూయిష్టంగా ఉంటే వాస్తవ పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటా యన్నదానికి జిల్లా కేంద్రమైన విజయనగరం పట్టణంలోని ట్రాఫిక్ సమస్యనే చెప్పవచ్చు. కొత్త పోలీస్ బాస్ వచ్చిన తరువాత ఏదో మార్పు కనిపించింది. అంతేకాదు పోలీస్ బాస్ ఆలోచనలు, ఆశయాలు స్ఫూర్తిదాయకంగా ఉండటంతో ఇంకేముంది పట్టణ వాసులకు ప్రధాన సమస్య అయిన ట్రాఫిక్ ఇబ్బందులు ఇక తొలగినట్లేనని జనం భావించారు. దానికి తగినట్లు గానే పోలీస్ బాస్ ట్రాఫిక్ సమస్యపై దృష్టి పెడుతూ అప్పుడప్పుడూ మీడియా సమావేశాల్లో ప్రకటనలు కూడా చేశారు. విజయనగరం పట్టణ వాహన చోదకులకు, పాదచారులకు దశ తిరిగిందని ప్రతి ఒక్కరూ ఉబ్బి తబ్బిబ్బయ్యారు. మయూరి జంక్షన్ పేరు మారింది. ఎస్పీ బంగ్లా జంక్షన్ అయ్యింది. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అన్న చందంగా పోలీసులు తలచుకుంటే జరగనిదే ముంది..! మయూరి జంక్షన్ రూపురేఖలు మారిపోయాయి. మయూరి జంక్షన్ నుంచి ఎస్పీ బంగ్లా వరకు సరికొత్త రహదారి వచ్చింది. రహదారికి ఇరువైపులా పూల కుండీలు వచ్చాయి. ఎంతైనా నాలుగో సింహం నాలుగో సింహమే. పురపాలక సంఘం చేయలేని పని పోలీసులు చేశారు. దటీజ్ పోలీస్ అనిపించారు. జనమంతా జేజేలు కొట్టారు. నాలుగో సింహానికి నీరాజనాలు పలికారు. ఇదే స్ఫూర్తితో పట్టణంలోని ట్రాఫిక్ సమస్య కూడా చిటికెలో పరిష్కారం అయి పోతుందని అనుకున్నారు. జనం అనుకున్నట్లు గానే ట్రాఫిక్ పైన పోలీసులు దృష్టి సారిం చారు. ప్రధానంగా మూడులాంతర్ల జంక్షన్ నుంచి గంటస్తంభం వరకు రోడ్డుకిరువైపులా మార్జిన్ లైన్లు వేసి ద్విచక్ర వాహనాల పార్కింగ్‌కు సూచికలు ఏర్పాటు చేశారు. పోలీసులకు కాలం కలిసి వచ్చింది. ప్రధాన రహదారుల విస్తరణ పనులు ఊపందు కున్నాయి. అన్ని బాగున్నా అల్లుని నోట్లో శని అన్నచందంగా ఏలిన నాటి శని పోలీసులను వదలడం లేదు. ఇప్పుడదే వారికి శాపమైంది. వారి పనితనానికి గీటురాయిగా మారింది. ఇంతా చేసిన పోలీస్ బాస్ క్షేత్రస్థాయిలో పర్యవేక్ష మరిచిపోయినట్లు కనిపిస్తోంది. అందుకనే ప్రజలకి యధావిధిగా ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు. కొన్ని ప్రాంతాల్లో కింది స్థాయి పోలీసులు చేస్తున్న నిర్వాకం మొత్తం వ్యవస్థకే మచ్చతెచ్చేలా ఉందన్నది జనం మాట. సాయంత్రం సమయంలో ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసరాల్లో ట్రాఫిక్ స్తంభిస్తోంది. ద్విచక్రవావానాలు కాదు గదా…పాదచారులు సైతం కదల్లేని పరిస్థితి. విశేషం ఏమిటంటే అక్కడే పోలీస్ కంట్రోల్ రూమ్ ఉంది. కానీ ఎందుకనో సమస్య తప్పడం లేదు. జనం నానా యాతన పడుతున్నారు. మరో విశేషం ఏమిటంటే ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి నుంచి తోటపాలేనికి వెళ్ళే రోడ్డులో ఎన్‌సిఎస్ మల్టీఫ్లెక్స్ ఎదురుగా ద్విచక్ర వాహనాలకు నో పార్కింగ్ బోర్డులు పెట్టారు. అయినప్పటికీ అక్కడ వాహనాల పార్కింగ్ తప్పడం లేదు. విచిత్రం ఏమిటంటే ఆటోలకు అక్కడ అవకాశం ఇచ్చిన పోలీసులు ద్విచక్ర వాహనాల పార్కింగ్‌ను ఎందుకు అడ్డుకుంటున్నారో పోలీస్ బాస్కే తెలియాలి. ఇటీవల కాలంలో ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని జనం బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. అక్కడ రోడ్డుకు ఇరువైపుల పెట్టిన ద్విచక్ర వాహనాల ప్లగ్‌లను ఆటో డ్రైవర్లు తీసేసి అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీసులకు ఇస్తున్నారు. వాహనదారులు వచ్చి లబోదిబో మంటుంటే సదరు ఆటో డ్రైవర్లే వెళ్ళి 30 నుంచి 50 రూపాయిలు వసూలు చేసి ఎవరి ప్లగ్‌లు వారికి ఇస్తున్నారు. ఈ దందాను చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఎవరైనా ధైర్యం చేసి ఆటో డ్రైవర్లను నిలదీస్తే దూరంగా ఉన్న కానిస్టేబుల్ ఏంటి సంగతి అని ప్రశ్నిస్తున్నారు. ఇది చాలా మంది జనం అనుభవం. దీంతో ఎవరికి చెప్పుకోవాలో తెలీక బాగా పరిచయం ఉన్న మీడియా ముందు వాపోతున్నారు.దీనికి తగ్గట్టుగానే పోలీస్ బాస్ మారినా పోలీసుల మాటతీరు మారలేదు. కిందిస్థాయి పోలీసులకు కౌన్సెలింగ్ చేసి వారి భాషను మార్చాలని జనం చెప్పుకొస్తున్నారు. నాలుగో సింహం ఉపయోగించే రాచభాష కర్ణకఠోరంగా ఉంది. నాగరిక సమాజం తట్టుకోలేకపోతోంది. ఎంతటి వారినైనా ‘ఏరా, ఒరై, ఏంటి.. లాంటి ఈసడింపు, బెదిరింపు మాటలతో బెంబేలెత్తిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన రహదారుల్లో పార్కింగ్, మార్కింగ్ చేసినా షాపుల వారు ఒప్పుకోవడం లేదు. తోపుడు బళ్ళు తొలగడం లేదు. అక్కడ ఉండే కిందస్థాయి పోలీస్ సిబ్బంది పట్టించుకోవడం లేదు. అలాగే ప్రధాన రహదారి పక్కన ఎవరైన కారు ఆపితే నాలుగో సింహం జూలు విదిలిస్తుంది. వారి భాష సరే సరి. అదే కొన్ని ‘ముఖ్యమైన’ కార్లు ఆగితే మాత్రం వారే దగ్గరుండి కాపలా కాస్తారు. ఇది చూసిన జనం ఇదేం చోద్యమని ముక్కున వేలేసుకోవడమే. పోలీసు బాసు ఒక సామాన్య వ్యక్తిలా రోడ్డుమీదకి వస్తే కిందస్థాయి సిబ్బంది తీరు తెన్నులు తెలుస్తాయని జనం చెబుతున్నారు. కిందస్థాయి సిబ్బందికి చెప్పకుండా, తెలీకుండా పోలీస్ బాస్ వస్తే నాలుగో సింహం అసలు స్వరూపం బయటపడుతుందని వారంటున్నారు. పోలీస్ బాసూ మరి మీరేమంటారు.


