శ్రీనూకాంబిక ఆలయానికి హుండీ ఆదాయం 39.28 లక్షలు
అనకాపల్లిటౌన్, ఫీచర్స్ ఇండియా: ప్రసిద్ధి చెందిన శ్రీ నూకాంబిక అమ్మవారి హుండీ ఆదాయం 39లక్షల 28వేల 157 రూపాయలు వచ్చిందని ఆలయ సహాయ కమిషనర్ ఎన్.సుజాత తెలిపారు. గురువారం నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర హుండీ లెక్కింపు జరిగింది. గత నెల 23 నుంచి ఈ నెల 26వ తేదీ వరకు ఈ ఆదాయం లభించిందని ఆమె చెప్పారు. అన్నదానం కార్యక్రమానికి 27వేల 169 రూపాయలు, 60 గ్రాములు బంగారం, 1510 గ్రాములు వెండి హుండీ ద్వారా వచ్చిందన్నారు. గత ఏడాది కొత్త అమావాస్య జాతర సందర్భంగా 28 రోజులకు 25 లక్షల 47వేల 167 రూపాయలు వచ్చిందన్నారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ ఏసీ ఆఫీస్ సిబ్బంది, శ్రీవారిసేవా సభ్యులు విశాఖపట్నం, గాజువాక తదితర ప్రాంతాల నుంచి వచ్చి పాల్గొన్నారు. ఆలయ సహాయ కమిషనర్ సుజాత,
దేవస్థానం అభివృద్ధి కమిటీ సభ్యులు బుద్ద నాగజగదీశ్వరరావు, కొణతాల వెంకటరావు, మళ్ల సురేంద్ర, బీఎస్ఎంకే జోగి నాయుడు, ఆడారి జగన్నాథరావు, ఈ కార్యక్రమాన్ని పర్యవే క్షించారు. ఈ జాతర సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి అమెరికా, సింగపూర్,సౌది అరేబియా, దుబాయ్, మలేషియా నుంచి భక్తులు విశేషంగా వచ్చి కానుకల రూపంలో ఆయా దేశాల కరెన్సీని హుండీలో వేశారు. ఈ హుండీ లెక్కింపులో పాత వెయ్యి, 500 రూపాయల నోట్లు 15వేల రూపాయలు వచ్చాయని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుడు కొణతాల వెంకటరావు తెలిపారు.


