పాక్ సర్కారుకు.. సైన్యానికి మధ్య విభేదాలు
- 16 Views
- admin
- April 30, 2017
- అంతర్జాతీయం తాజా వార్తలు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్, అక్కడి సైన్యానికి మధ్య విభేదాలు మరింత ముదిరాయి. సైన్యానికి, ప్రభుత్వానికి మధ్య విభేదాలు ఉన్నాయంటూ వచ్చిన ఒక కథనానికి సంబంధించి షరీఫ్ తీసుకున్న చర్య పట్ల సైన్యం పెద్దలు బహిరంగంగా పెదవి విరిచారు. దీంతో రెండు వర్గాల నడుమ అంతరం పెరిగింది.
గత ఏడాది అక్టోబర్‌లో ‘డాన్’ వార్తా పత్రికలో ఈ కథనం వచ్చింది. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తూ.. భారత్, అఫ్గానిస్థాన్‌లో పరోక్ష యుద్ధాలు చేపడుతున్న ఉగ్రవాద ముఠాల వ్యవహారంపై ప్రభుత్వానికి, సైనిక నాయకత్వానికి మధ్య విభేదాలు తలెత్తాయని ఆ పత్రిక మొదటి పేజీలో రాసింది. ‘‘ఈ ముఠాల వల్ల పాకిస్థాన్ అంతర్జాతీయంగా ఏకాకిగా మారుతోందని సైనిక నాయకత్వానికి ప్రభుత్వం ఒక అత్యున్నత స్థాయి సమావేశంలో విస్పష్టంగా తెలియజేసింది’’ అని కథనం పేర్కొంది. ఉగ్రవాదులపై పోలీసులు చేపట్టే చర్యల్లో సైనిక గూఢచర్య సంస్థలు జోక్యం చేసుకోరాదని కూడా తేల్చిచెప్పినట్లు వివరించింది.
ఈ కథనంపై సైన్యం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ఈ నేపథ్యంలో సమాచార మంత్రి పర్వేజ్ రషీద్‌ను ప్రభుత్వం తొలగించాల్సి వచ్చింది. సమావేశ వివరాలు లీకేజీ కావడం వెనుక బాధ్యులను గుర్తించేందుకు.. సైన్యం డిమాండ్‌పై జస్టిస్ ఆమిర్ రజా ఖాన్ నేతృత్వంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇటీవలే తన నివేదికను ప్రధాన మంత్రికి సమర్పించింది. సదరు సమావేశ అంశాలు లీక్ కావడానికి తారిక్ ఫతేమీ కారణమని తేల్చింది. దీంతో ఆయనను తొలగిస్తూ ప్రధాని ఒక నోటిఫికేషన్ ఇచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. దీనిపై పాక్ సైన్యం అసాధారణంగా స్పందించింది. ‘‘డాన్ లీక్‌పై వచ్చిన నోటిఫికేషన్ అసంపూర్తిగా ఉంది. విచారణ బోర్డు సిఫార్సులకు అనుగుణంగా లేదు. ఆ నోటిఫికేషన్‌ను తిరస్కరిస్తున్నాం’’ అని పాక్ సైనిక ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ‘ట్విటర్’లో పేర్కొన్నారు.
కొద్దిసేపటికే దీనిపై పాక్ హోం మంత్రి చౌధురి నిసార్ అలీ ఖాన్ స్పందించారు. సైన్యం తీరుపై అసహనం వ్యక్తంచేస్తూ.. ‘‘ప్రాముఖ్యత కలిగిన అంశాలపై ట్విటర్ ప్రతిస్పందనలు చేయడం దేశానికి ప్రమాదకరం’’ అని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఎలాంటి నోటిఫికేషన్ జారీ కాలేదన్నారు. ‘‘విడుదలైన నోటిఫికేషన్‌గా చెబుతున్న సదరు పత్రం.. హోం మంత్రిత్వశాఖకు ప్రధాని కార్యాలయం జారీ చేసింది. దీని ఆధారంగా.. దర్యాప్తు సిఫార్సులను అమలు చేస్తున్నట్లుగా సవివర నోటిఫికేషన్‌ను హోం శాఖ జారీ చేస్తుంది. నివేదికను పూర్తిస్థాయిలో అమలు చేస్తాం. ఎవరినీ వదలం’’ అని తెలిపారు. తాలిబన్ మాజీ అధికార ప్రతినిధి ఎహసానుల్లా ఎహ్సాన్ చేసినట్లుగా చెబుతున్న నేరాంగీకార ప్రకటనను సైన్యం ఇటీవల విడుదల చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. అయితే నిపుణులు, విపక్షాలు చేస్తున్న విమర్శలను తప్పించుకోవడానికే హోం మంత్రి ఈ ప్రకటన చేశారని విశ్లేషకులు చెబుతున్నారు.


