
ముంబై లక్ష్యం 20 ఓవర్లలో 154.. ఓ దశలో జట్టు స్కోరు 104/2. ఇక గెలువాలంటే 42 బంతుల్లో 50 పరుగులు చేయాలి. ముంబైకి ఇది పెద్ద స్కోరే కాదు.. కానీ గుజరాత్ బౌలర్ల పోరాటం ముందు ముంబై స్టార్లు దూది పింజల్లా తేలిపోయారు. ఫలితం 35 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు.ఇక విజయసమీకరణం కాస్త 12 బంతుల్లో 15. బాసిల్ థంపి బంతిని తీసుకున్నాడు.. ఓవైపు క్రీజ్‌లో క్రునాల్ పాండ్యా ఉన్నా… రెండోఎండ్‌లో ఆరు బంతుల్లో మూడు వికెట్లు పడగొట్టాడు. 6 బంతుల్లో 11 పరుగులు కావాలి. ప్రత్యామ్నాయం లేక ఇర్ఫాన్‌కు బంతి ఇచ్చారు. తొలి బంతి సిక్సర్. రెండో బంతికి సింగిల్… మూడో బంతికి వికెట్. ఇక 3 బంతుల్లో 4 పరుగులు కావాలి.. తర్వాతి రెండు బంతులకు 3 పరుగులు వచ్చాయి. దాదాపుగా ముంబై విజయం ఖాయమైన తరుణంలో ఇర్ఫాన్ ఆఖరి బంతి యార్కర్ వేశాడు. మలింగ బ్యాట్‌కు ఎక్కడ తగిలిందోగానీ నేరుగా పాయింట్లో ఉన్న జడేజా దగ్గరకు బంతి వెళ్లడం .. మెరుపు వేగంతో వికెట్లను గిరాటేయడం అంతా క్షణకాలంలో జరిగింది.
సీన్ కట్ చేస్తే మ్యాచ్ టై. ఫలితం కోసం సూపర్ ఓవర్.
రాజ్‌కోట్: ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ఖాతాలో మరో విజయం. లక్ష్య ఛేదనలో పార్థివ్ పటేల్ (44 బంతుల్లో 70, 9 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగినా.. ఆఖర్లో గుజరాత్ బౌలర్ల పోరాట పటిమ ముందు శనివారం ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్ టై అయ్యింది. దీంతో సూపర్ ఓవర్‌తో ఫలితాన్ని తేల్చారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 153 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (35 బంతుల్లో 48, 6 ఫోర్లు, 2 సిక్సర్లు), జడేజా (21 బంతుల్లో 28, 2 ఫోర్లు, 1 సిక్స్), ఆండ్రూ టై (12 బంతుల్లో 25, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మినహా మిగతా వారు నిరాశపర్చారు. ఆరంభంలో ముంబై పేసర్ల ధాటికి గుజరాత్ టాప్ ఆర్డర్ కాకవికలమైంది. ఓ ఎండ్‌లో ఇషాన్ నిలకడగా ఆడినా.. రెండో ఎండ్‌లో మెకల్లమ్ (6), రైనా (1), ఫించ్ (0), దినేశ్ కార్తీక్ (2) వరుస విరామాల్లో ఔటయ్యారు. దీంతో 56 పరుగులకే గుజరాత్ 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఇషాన్, జడేజా ఐదో వికెట్‌కు 27 పరుగులు జత చేయగా, ఆఖర్లో ఫాల్క్‌నర్ (21), టై ఎనిమిదో వికెట్‌కు 19 బంతుల్లో 43 పరుగులు జోడించడంతో గుజరాత్‌కు గౌరవప్రదమైన స్కోరు దక్కింది. క్రునాల్ పాండ్యా 3 వికెట్లు తీశాడు.