న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)తో జోడీ కట్టిన కాంగ్రెస్ పార్టీ… అక్కడ సీన్ రివర్స్ కావడంతో యూటర్న్ తీసుకుంది. తాజాగా జరగనున్న యూపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్పీతో తెగతెంపులు చేసుకుని ఒంటరిగా బరిలో నిలిచేందుకు సిద్ధపడింది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన పార్టీ నాయకులతో ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్ధులతో పాటు జిల్లా స్థాయి ఆఫీస్ బేరర్లు, ఇతర ముఖ్యనేతల నుంచి పార్టీ అధిష్టానం అభిప్రాయాలు సేకరించింది. అందరితో సంప్రదింపులు జరిపిన తర్వాత సమాజ్వాదీ పార్టీతో ఎలాంటి ఎన్నికల పొత్తు పెట్టుకోకూడదని నిర్ణయించినట్టు యూపీ కాంగ్రెస్ చీఫ్ రాజ్ బబ్బర్ వెల్లడించారు.
ఇప్పటికీ సమాజ్వాదీ పార్టీలో కుమ్ములాటలు కొనసాగుతుండగా… ఆ పార్టీ అంతర్గత కుమ్ములాటల వల్లే తాము అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయామని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. క్షేత్ర స్థాయి నుంచి మళ్లీ పార్టీని బలోపేతం చేస్తామని చెబుతున్నారు. జూన్, జూలై నెలల మధ్య ఉత్తరప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి.