ఐపీఎల్‌లోనే అత్యంత ఖరీదైన ఆటగాడు బెన్ స్టోక్స్ ఒకే ఒక్క మ్యాచ్‌తో తన విలువను కాపాడుకున్నాడు. 10 పరుగులకే 3 కీలక వికెట్లు పడినా.. ధోనీతో కలిసి వీరోచిత ఇన్నింగ్స్ ఆడి.. చివర్లో ఫినిషింగ్ సత్తా ఏంటో చూపెట్టాడు. బంతి, బంతికి లయన్స్ బౌలర్లు పట్టుబిగించినా తాను మాత్రం శతకాన్ని కానుకగా ఇస్తూ ఒంటిచేత్తో పుణెకు ప్రతీకార విజయాన్ని అందించాడు.పుణె: ఐపీఎల్లో గుజరాత్ చేతిలో ఎదురైన ఓటమికి పుణె ప్రతీకారం తీర్చుకుంది. సొంతగడ్డపై లక్ష్య ఛేదనలో బెన్ స్టోక్స్ (63 బంతుల్లో 103 నాటౌట్; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీతో చెలరేగడంతో.. సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో పుణె 5 వికెట్ల తేడాతో గుజరాత్ లయన్స్‌పై నెగ్గింది. టాస్ ఓడిన గుజరాత్ 19.5 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటైంది. మెకల్లమ్ (27 బంతుల్లో 45; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) లయన్స్‌లో టాప్‌స్కోరర్. ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 31)తో కలిసి తొలి వికెట్‌కు 55 పరుగులు జోడించాడు. వన్‌డౌన్‌లో కెప్టెన్ రైనా (8) నిరాశపర్చగా, పవర్‌ప్లేలో 55 పరుగులు చేసిన లయన్స్‌కు పదో ఓవర్లో తాహిర్ షాకిచ్చాడు.
చివరి రెండు బంతులకు ఫించ్ (6 బంతుల్లో 13; 1 ఫోర్, 1 సిక్స్), డ్వేన్ స్మిత్ (0)లను వెనక్కి పంపాడు. 12వ ఓవర్లో మెకల్లమ్ ఔటవడంతో గుజరాత్ స్కోరు 109/5గా మారింది. మిడిలార్డర్లో దినేశ్ కార్తీక్ (26 బంతుల్లో 29), జడేజా (12 బంతుల్లో 19; 3 ఫోర్లు) ఓ మోస్తరుగా ఆడి ఆరో వికెట్‌కు 26 పరుగులు జత చేశారు. చివర్లో పుణె బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో లయన్స్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. 18వ ఓవర్లో రెండు, ఆఖరి ఓవర్లో మరో రెండు వికెట్లు పడటంతో గుజరాత్ ఓ మాదిరి స్కోరుకు ఆలౌటైంది. తాహిర్, ఉనాద్కట్ చెరో మూడు వికెట్లు తీశారు.
బెన్ బాదుడు..
తర్వాత పుణె 19.5 ఓవర్లలో 5 వికెట్లకు 167 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్ సాంగ్వాన్ ధాటికి తొలి ఓవర్లోనే రహానే (4), స్టీవ్ స్మిత్ (4), రెండోఓవర్లో మనోజ్ తివారి (0) ఔటవడంతో పుణె 10 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. స్టోక్స్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నంలో త్రిపాఠి (6) అనూహ్యంగా రనౌటయ్యాడు. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి పుణె స్కోరు 4 వికెట్లకు 43 పరుగులు. ఇక ఇక్కడి నుంచి ధోనీ, స్టోక్స్ ఒంటరి పోరాటం చేశారు. తమ అనుభవాన్ని రంగరిస్తూ అవసరమైనప్పుడల్లా ఒకటి, రెండు భారీ షాట్లుకొడుతూ ఇన్నింగ్స్‌ను నడిపించారు. స్టోక్స్ 38 బంతుల్లో అర్ధసెంచరీ చేయగా, మహీ కూడా సమయోచితంగా స్పందించాడు. గెలువాలంటే 24 బంతుల్లో 44 పరుగులు చేయాల్సిన దశలో ధోనీ వైడ్‌బాల్‌ను వెంటాడి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 76 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక క్రిస్టియన్ (17 నాటౌట్)తో కలిసి స్టోక్స్ సిక్సర్లు, ఫోర్ల జాతర చూపెట్టాడు. ఆరో వికెట్‌కు కేవలం 22 బంతుల్లో అజేయంగా 49 పరుగులు జత చేసి పుణెకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.