ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలు పత్రికలు
- 63 Views
- admin
- May 2, 2017
- జాతీయం తాజా వార్తలు రాష్ట్రీయం సినిమా స్థానికం
ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం నేడు
మానవాళి మనుగడ సాఫీగా సాగాలంటే ప్రజాభీష్టానికి ప్రతిబింబాలుగా పత్రికలు ఉండాలి. ఆ పత్రికలకు ప్రతి అంశాన్నీ గొంతు చించుకొని అరిచే స్వేచ్ఛ ఉండాలి. ఆనాడే దేశంలో ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం విలసిల్లుతుంది. అందుకే మీడియాను లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జుడీషియరీల తర్వాత ఫోర్త్ ఎస్టేట్‌గా పేర్కొన్నారు. ఫోర్త్ ఎస్టేట్‌లో పత్రికలతో పాటు ప్రసారమాధ్య మాలన్నీ వస్తాయి. ఆంగ్లో ఐరిస్ రాజకీయ పరిశోధకుడు ఎడ్మండ్ బ్రూక్ పత్రికల్ని అత్యంత శక్తివంతమైనవిగా పేర్కొన్నాడు. ప్రజాభిప్రాయాలు ప్రతిబింబించడంలోనూ, మలచడంలోనూ అవి కీలకమైన పాత్ర పోషిస్తాయని తొలిసారిగా ప్రపంచానికి నొక్కి చెప్పాడు. శక్తివంతమైనవని చెప్ప డానికి మీడియాపై జరుగుతున్న దాడులే నిదర్శనమని నిరూపించాడు. అనేక దేశా లలో ఇప్పటికీ స్వేచ్ఛ లేదు. ప్రభుత్వాలు విధించే ఆంక్షలు ఒకెత్తయితే మాఫియా ముఠాల ఒత్తిళ్లు దాడులు మరో ఎత్తు. టెర్రరిస్టు గ్రూపులకు, డ్రగ్ మాఫియా దాడులకు ఎందరో జర్నలిస్టులు బలైపో యారు. యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్‌లోని 19వ అధికరణం భావ ప్రకటన స్వేచ్ఛ గురించి చెబుతోంది. పత్రికా స్వేచ్ఛకు అదే మూల భూమిక పోషిస్తోంది. 1993 ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల గురించి ప్రకటన చేసింది. అదే సమయంలో ఆఫ్రికా దేశాల్లో సెన్సార్షిప్ ఉండేది. పత్రికలమీద ఆంక్షలుండేవి. దానికి నిరసనగా ఆఫ్రికన్ జర్నలిస్టులు మూకుమ్మడి నిరసన ప్రకటన చేశారు. దాన్ని గుర్తించిన యునెస్కో సంస్థ 1993లో వరల్డ్ ప్రెస్ ఫ్రీడం డే జరిపాలని ప్రతిపాదించింది. అనాటి నుంచీ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం జరగుతోంది. అప్పటి నుంచీ ప్రమాదం అంచుల్లో సైతం పనిచేసే జర్నలిస్టులకు వరల్డ్ ప్రెస్ ఫ్రీడం అవార్డుకు ఎంపిక చేస్తున్నారు. గుర్తించబడిన జర్నలిస్టుకు 25,000 అమెరికన్ డాలర్లు కూడా బహుకరిస్తారు. ప్రపంచ దేశాల్లోని ఆయా దేశాల ప్రభుత్వాలు ఒకలా వ్యవహరించవు. కొన్ని దేశాల్లో పత్రికల్నే నిర్వహిం చనివ్వరు. మరి కొన్ని దేశాల్లో నిర్వహించే ఆవకాశం ఉన్నా వాటికి స్వేచ్ఛ నామమాత్రం. చాలా దేశాల్లో అంకితమైన జర్నలిస్టులు నిప్పుల్లో కాలుతున్న కత్తులమీద నడుస్లూ వాస్తవాలు వెల్లడిస్తున్నారు. మృత్యు కుహరానికి ఆమడ దూరంలో విధులు నిర్వహిస్తున్నారు. అలాంటి జర్నలిస్టులు 2006లో 75 మంది హత్య చేయబడ్డారు. మరో 32 మంది మీడియా ఉద్యోగులు బలిదానం చేశారు. ఒక సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచ జనాభా 35శాతం మంది పత్రికా స్వేచ్ఛలేని ప్రపంచంలో జీవిస్తున్నారంటే పరిస్ధితి అర్ధమౌతుంది. ప్రజాస్వామ్య దేశాల్లో కాస్త పర్వాలేదు. కొన్ని సూచనల ఆధారంగా పత్రికా స్వేచ్ఛకు కొలబద్దలు నిర్ణయించి రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనే సంస్థ దేశాలకు రేంకింగ్స్ ప్రకటించింది. దాదాపు రెండు వందల దేశాల్లో భారతదేశం 105 స్థానంలో ఉన్నట్లు తేలింది. పాకిస్థాన్ మరింత ఘోరంగా 157వ స్థానంలోనూ, మరింత ఘోరంగా చైనా 163వ స్థానంలోనూ నిలిచాయి. జపాన్ 51వ స్థానంలో ఉంది. అమెరికా 53, ఇంగ్లండ్ 27, ఇటలీ 40, ఫ్రాన్స్ 35 స్థానంలోనూ నిలిచాయి. జర్నలిస్టులు, పత్రికలు స్వేచ్ఛగా వ్యవహరించడంలో ఫిన్‌ల్యాండ్, ఐస్‌ల్యాండ్, ఐర్లాండ్, నెదర్లాండ్స్ దేశాలు ముందు వరసలో ఉన్నాయి. పత్రికలు స్వేచ్ఛ ఎక్కడ కోల్పోతాయో అక్కడ అరాచకాలు మొదలైనట్టు లెక్క. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో విధించే ఆంక్షలే. ఇప్పటికీ ప్రజాస్వామ్యంలో కూడా జర్నలిస్టులు బెదిరింపులు ఎదుర్కొంటూనే పనిచేస్తున్నారు. పత్రికాస్వేచ్ఛను జర్నలిస్టులు కాదు కపాడుకోవలసింది. ప్రజలు. ఈ ఏడాది 2017 వరల్డ్ ప్రెస్ డే కు ఇండోనేషియా వేదికైంది.
-ఆడాకి వెంకటరమణ,7093 079 642


