మహానాడు వేదిక ఏయూ మైదానం
- 11 Views
- admin
- May 2, 2017
- తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
మహా క్రతువు కోసం.. మండుటెండలో..:మహానాడుకు వేదిక ఖరారు చేసేందుకు తెదేపా కేంద్ర కమిటీ ప్రతినిధులతోపాటు రాష్ట్ర, జిల్లా నాయకుల బృందం సోమవారం ఉదయం నుంచి మండుటెండలో పలు ప్రాంతాల్లో పర్యటించింది. ఐదు ప్రాంతాలను పరిశీలించింది. ముందుగా సిద్ధం చేసుకున్న మ్యాపుల ప్రకారం.. ప్రధాన వేదిక, పార్కింగు, భోజన వసతి, విశ్రాంతి ప్రాంగణం, ఎన్టీఆర్ పుట్టిరోజు నేపథ్యంలో నిర్వహించే రక్తదాన శిబిరం.. ఎన్టీఆర్ జీవిత విశేషాలను తెలిపే చిత్రప్రదర్శన తదితర ఏర్పాట్లకు అనువైన ప్రాంతాలను గుర్తించింది. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చింది.
వేదిక ఖరారుపై జిల్లా నాయకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. భాగస్వామ్య సదస్సు జరిగిన ప్రాంతం అనువుగా ఉంటుందని కొందరు.. పాత డెయిరీ ఫారం ప్రాంతమైతే ట్రాఫిక్ ఇబ్బందులుండవని మరికొందరు.. స్టీల్‌ప్లాంటు ప్రాంతమే మేలని ఇంకొందు అభిప్రాయపడ్డారు. అధినేత చంద్రబాబుతో జరిగిన వీడియో కాన్ఫరెన్సులో మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కో గ్రూపుగా ఒక్కో వాదన వినిపించారు. అన్నీ విన్న ఆయన 2013లో మీ కోసం పాదయాత్ర ముగింపు సభ నిర్వహించిన ఆంధ్ర విశ్వవిద్యాలయ మైదానాన్నే ఖరారు చేయాలని సూచించడంతో అంతా ఏకీభవించారు. నగర శివార్లలో కాకుండా నడిబొడ్డున వేదిక ఖరారు చేస్తే జనానికి చేరువవుతామనే ఉద్దేశంలో దీనిని ఎంపిక చేసినట్టు చెబుతున్నారు. జిల్లాలో పర్యటించనున్న రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి నారా లోకేష్ ఈ వేదికను పరిశీలించనున్నట్లు సమాచారం. మహానాడుకు వచ్చే వాహనాల పార్కింగ్, అతిథుల భోజన వసతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని నేతలు నిర్ణయించారు. ఇందుకోసం 15 కమిటీలను నియమించారు. మంత్రులు చినరాజప్ప, గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, తెదేపా నగర, జిల్లా అధ్యక్షులు వాసుపల్లి గణేష్‌కుమార్, పప్పల చలపతిరావు, తెలంగాణ రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు ఎల్.వి.రమణ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కమిటీల ప్రతినిధులతో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకటరావు చర్చించారు. ఇప్పట్నుంచే ప్రణాళిక ప్రకారం.. అనుమతులు, ఏర్పాట్లను పర్యవేక్షించాలని బాధ్యులకు సూచించారు. సమన్వయ కమిటీ సమావేశంలో ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి, ఎమ్మెల్యేలు పీలా గోవిందసత్యనారాయణ, పీవీజీఆర్ నాయుడు (గణబాబు), పల్లా శ్రీనివాసరావు, వంగలపూడి అనిత, లలితకుమారి, పంచకర్ల రమేష్‌బాబు, కిడారి సర్వేశ్వరరావు, తెదేపా కేంద్ర కమిటీ సభ్యులు బి.డి.జనార్దన, తెదేపా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శోభా హైమావతి, మాడుగుల ఇన్‌ఛార్జి రామానాయుడు, స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ మోహనరావు, మాజీ మంత్రులు రెడ్డి సత్యనారాయణ, మణికుమారి, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శులు పీలా శ్రీనివాసరావు, మహ్మద్ నజీర్, లాలం భాస్కరరావు, పాల్గొన్నారు.


