కర్మాగారాలను ప్రైవేటీకరణ చేస్తే తిప్పికొడతాం.. అఖిలపక్షాల హెచ్చరిక
- 9 Views
- admin
- May 3, 2017
- తాజా వార్తలు స్థానికం

అనకాపల్లి, ఫీచర్స్ ఇండియా : తుమ్మపాల సహకార కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తే తరిమి కొడతామని అఖిలపక్ష పార్టీలు హెచ్చరించాయి. స్థానిక పూడిమడక రోడ్‌లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు మాట్లా డుతూ తుమ్మపాల కర్మాగారాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే యత్నాలు చేస్తున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పడం దారుణమన్నారు. టిడిపి ప్రభుత్వానికి సహకార కర్మాగారాలను ఆదుకునే సత్తా లేకుంటే, చేతులెత్తేస్తే రైతాంగమే ఐక్యంగా నడుపుకుంటుందని అన్నారు. గతంలో కూడా చక్కెర కర్మా గారాలను పూర్తిగా నిర్వీర్యం చేసిందని, తుమ్మపాలలో ఆధునీకరి స్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి నేడు మూతవేత దిశగా ప్రభుత్వం నెట్టిందని అన్నారు. విశాఖ డెయిరీ ఛైర్మన్ ఆడారి తులసీరావుకు అప్పగించేందుకు మంత్రి గంటా, ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణలు పోటీ పడుతున్నారని ఆరోపించారు. సహకార రంగంలో కర్మాగారాన్ని నడపాలని ఇప్పటికే ప్రభుత్వం నియమించిన పలు కమిటీలకు రైతులు ముక్తకంఠంతో చెప్పారని, ఆ నివేదికలను ప్రభుత్వం తొక్కిపెట్టిందని అన్నారు. తుమ్మపాల కర్మాగారన్ని అమ్మే హక్కు లేదంటూ గతంలో హైకోర్టు చంద్రబాబు ప్రభుత్వానికి అక్షింతలు వేసినా బుద్ధి రాలేదని అన్నారు. తుమ్మపాల ఫ్యాక్టరీ తెలుగుదేశం ఆస్థి కాదని, ఇది రైతులకు సంబంధించి అస్థి అని, దీనిపై పూర్తి హక్కులు రైతులకే ఉన్నాయని, గుర్తెరిగి నడుచుకోవాలని హెచ్చరించారు. తుమ్మపాల కర్మాగారాన్ని ప్రైవేటీకరిస్తే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. పట్టణ వైకాపా అద్యక్షుడు మందపాటి జానకిరామరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ నాయకులు సూరిశెట్టి రమణ అప్పారావు, జాజుల రమేష్, సీపీఐ నాయకులు ఎం మాధవరావు, కే లక్ష్మణ, కె సూర్యనారాయణ, కే శంకరరావు, సీపీఎం నాయకులు ఏ బాలకృష్ణ, కర్రి అప్పారావు, ప్రజా సంఘాల ఐక్య వేదిక నాయకులు కె సురేష్‌బాబు, బొట్ట చిన్ని యాదవ్, ఒమ్మి రాము యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
5న మంత్రి లోకేష్ పర్యటన
అనకాపల్లి, ఫీచర్స్ ఇండియా : రాష్ట్ర పంచాయితీశాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఈనెల 5న తొలిసారిగా అనకాపల్లి వస్తున్న మంత్రి లోకేష్‌కు ఘనంగా స్వాగతం పలకాలని తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలకు, అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ కోరారు. బుధవారం ఎమ్మెల్యే పార్టీ కార్యాలయంలో నియోజకవర్గం స్థాయి నాయకులు, అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పీలా మాట్లాడుతూ 5వ తేదీ ఉదయం 9గం||లకు మంత్రి లోకేష్ అనకాపల్లి శ్రీనూకాంబిక అమ్మవారిని దర్శించుకుంటారన్నారు. అనంతరం ఆలయ కళ్యాణమండపంలో కార్యకర్తలతో మంత్రి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి నెహ్రూచౌక్ జంక్షన్లో నూతనంగా నిర్మించిన బస్టాండ్‌ను ప్రారంభిస్తారు. తరువాత కసింకోట ఎండీవో కార్యాలయం వద్ద రూ.30కోట్లతో అభివృద్ధి పనులకు శంఖు స్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి లోకేష్ మాట్లాడుతారు. కార్యక్రమం అనంతరం పాయకరావుపేట వెళతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు బుద్ధ నాగ జగదీశ్వరరావు, బొలిశెట్టి శ్రీనివాసరావు, ఎం ధనమ్మ, కొణతాల వెంకట్రావు, గుత్తా ప్రభాకర్ చౌదరి, పంచాయితీరాజ్ డీఈ, ఎండీవోలు పాల్గొన్నారు.


