వెలుగులో కుమ్ములాటలు
- 17 Views
- admin
- May 3, 2017
- తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
మూడు గ్రూపులు, కులాల కుంపట్లు
ఆధిపత్య చెలాయింపే లక్ష్యం
పర్యవేక్షణ లోపమూ కారణమే
విజయనగరం, ఫీచర్స్ ఇండియా : వెలుగులో కుమ్ములాటలు చోటు చేసుకున్నాయి. అధికారుల బదిలీలు అందుకు వేదికయ్యాయి. నియంత్రించాల్సిన ఉన్నతాధికారులు చోద్యం చూడడంతో అవి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకునే స్థాయికి చేరాయి. డిఆర్డిఎ పీడీగా ఉన్న ఢిిల్లీరావు ఇటీవల బదిలీపై నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్గా వెళ్లిపోవడంతో గత రెండు నెలలుగా పీడీ పోస్టు ఖాళీగా ఉంది. ఈ పోస్టులో ప్రస్తుతం జెడ్పి సిఇఒగా ఉన్న జి.రాజకుమారి ఇన్ఛార్జి బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో తెరమీదకు వచ్చిన బదిలీలు వెలుగులో కుమ్ములాటలకు దారితీశాయి. ఎప్పటి నుంచో ఆధిపత్యపోరుకు అలవాటు పడ్డ వారు ప్రస్తుతం కులాల పేరిట గ్రూపుల కుంపటిని రాజేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రేషనలైజేషన్ పక్రియలో భాగంగా అధికారుల బదిలీలు జరగాల్సుంది. కానీ జిల్లా వెలుగులో బదిలీలు జరగలేదు. నిబంధనలకు అనుగుణంగా పీడీ రాజకుమారి దగ్గరుండి బదిలీల పక్రియ పూర్తి చేయాల్సుంది. కానీ ఈ బాధ్యతలను కొంత మంది కిందిస్థాయి అధికారులపై వదిలేయడంతో బదిలీల్లో కుమ్ములాటలు నెలకొన్నాయి. వీటి ఆధారంగానే గొడవలు జరుగుతున్నాయి. గ్రూపులను నియంత్రించి, పాలనను గాడిలో పెట్టాల్సిన వారు ఉదాశీనంగా ఉండడం ఎంత వరకు సబవన్న ప్రశ్న వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అధికారుల మధ్య కుమ్ములాటలు చిలికిచిలికి గాలివానగా మారాయి. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకొనే స్థాయికి చేరాయి.
గ్రూపులుగా సిబ్బంది
డిఆర్డిఎలో మూడు గ్రూపులుగా సిబ్బంది చీలినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న డిపిఎం ఐబిగా ఉన్న జయశ్రీ గతంలో ఆధిపత్యం చెలాయించేవారన్న ఆరోపణలున్నాయి. కొంతమంది ఎపిఎంలతో ఆమె ఒక గ్రూపును నడిపేవారని సమాచారం. అలాగే డిపిఎం ఫైనాన్స్ హరేరాం అసోషియేషన్ నాయకుడిగా ఉండడం, ఉద్యోగుల సమస్యలను ఆయన అధికారుల దష్టికి తీసుకెళ్తుండడంతో ఆయనను మరో గ్రూపుగా నాయకుడిగా ప్రచారం చేస్తున్నారు. అలాగే ప్రస్తుత ఐబి ప్రాజెక్టు మేనేజర్ ఉన్న డైజి అనే ఆమె మరోగ్రూపును నడుపుతున్నట్లు సమాచారం. డిల్లీరావు ఉన్నంతకాలం ఈ గ్రూపు రాజకీయాలు బయటపడలేదు. కానీ ఆయన బదిలీపై వెళ్లిపోవడం, పర్మినెంటు పీడీ నియామకం జాప్యంతో మళ్లీ డిఆర్డిఎలో వర్గపోరు మొదలైంది.
వాస్తవానికి అన్ని శాఖల్లోనూ చిన్న చిన్న తేడాలు ఉన్నప్పటికీ అక్కడ ఆశాఖ అధిపతి వాటిని నియంత్రిస్తుంటారు. కానీ ఢిల్లీరావు బదిలీ తరువాత సిబ్బందిపై నియంత్రణ తప్పింది. బదిలీల వంటి కీలక అంశాన్ని గాలికొదిలేయడంతో సిబ్బందిలోని విబేదాలు బయటపడ్డాయి. చివరికి అవి ఒకరిపై ఒకరు పిర్యాదు చేసుకునే స్థాయికి వచ్చాయి. ప్రస్తుతం వెలుగు బదిలీల జాబితాలో తప్పులు జరిగినట్లు ఆరోపణలున్నాయి. జిల్లా కలెక్టర్ ఇప్పటికైనా వెలుగుపై ద ష్టి సారించి, సిబ్బందిని ఒకగాడిలోకి పెట్టాల్సుంది. లేదంటే ప్రజా పాలనకు, ఇతర సిబ్బందికి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది.
అవినీతి ఆరోపణలు
వెలుగులో కుమ్ములాటల్లో అవినీతి భాగోతాలు కూడా బయటపడుతున్నట్లు సమాచారం. అధిపత్య పోరులో భాగంగా గ్రూపుల అంతర్యుద్ధమే జరుగుతోంది. దీంతో వారి అవినీతి అవకతవకలపైనా చర్చ సాగుతోంది. వీటిని సాకుగా చూపే ఎపిఎంలు, ఇతర సిబ్బందిపై వేటు వేసేందుకు పావులు కదుపుతున్నట్లు తెలిసింది. ఇప్పటికైనా వెలుగుపై సమగ్ర విచారణ జరిపి, తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కొందరు కోరుతున్నారు.


