స్వయంశక్తి మున్సిపాలిటీలకే ప్రోత్సహం.. అర్హత మార్కులు సాధించినవాటికే ఆర్ధిక ఆసరా
- 19 Views
- admin
- May 3, 2017
- తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
యలమంచిలి, ఫీచర్స్ ఇండియా: కేంద్రం విధించిన అర్హత గీటురాయి పరీక్షలో నెగ్గితేనే మున్సిపాలిటీలకు నిధులు విడుదలవుతాయన్న చేదునిజం బట్టబయలైంది. పనుల్లో సృజనాత్మక లేకుండా, ఆదాయ మార్గాలు అన్వేషించకుండా కార్యాలయాల్లో కూర్చొని కాలక్షేపం చేద్దామనే మున్సిపాలిటీలకు కష్టకాలం ఎదురైంది. రానున్న నిధుల ఊహల్లో తేలిపోతూ కంటున్న కలలు కరిగిపోయే రోజులు మున్సిపాలిటీలకు ఎదురుకానున్నాయి. సొంత ఆదాయం సమకూర్చుకోవడంలో విఫలమైతే కేంద్రం నిధుల విడుదలలోనూ భారీ కోతలు తప్పవన్న హెచ్చరికలు జారీ అయ్యాయి. విధి నిర్వహణలో వెనకబడితే ఇక వెనకేనని హెచ్చరిస్తోంది. సిబ్బంది జీతభత్యాలు, తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ, పారిశుధ్యం మొదలైన సేవలకు అయ్యే వ్యయంలో స్వయం సమృద్ధి సాధిస్తేనే నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. కనీసం 60శాతం మున్సిపాలిటీ రాబడితో జరుగుతుంటేనే వాటి విస్తరణకు నిధులు సమకూరుస్తామని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ ఆదిలోనే స్పష్టం చేసింది. అందుకే 2017-18 కి రూపొందించిన బడ్జెట్లో వాస్తవాలకు దూరంగా మున్సిపాలిటీలు బడ్జెట్లు రూపొందించాయని విమర్శలు ఎదుర్కొంటున్నాయి. అందుకు యలమంచిలి మున్సిపాలిటీ కూడా మినహాయింపు కాదని దాని బడ్జెట్ చూస్తేనే అవగతమౌతుందంటున్నారు నిపుణులు. ఎటువంటి ఆదాయ వనరులు లేని గ్రామ పంచాయతీని ప్రజలు నిరసిస్తున్నప్పటికీ అప్పటి ప్రభుత్వం ఆదరా బాదరాగా మున్సిపాలిటీని చేసేసింది. అప్పటినుంచీ కష్టాలు ప్రారంభమయ్యాయి. సిబ్బంది కూర్చోవడానికీ స్థలం లేక ఒక కల్యాణమండపంలో కార్యాలయం నడుస్తోంది. అరకొర నిధులతో పారిశుధ్య కార్మికులకు ఎప్పటి కప్పుడు జీతాలు చెల్లించలేని మున్సిపాలిటీకి కేంద్రంలోని కొత్త సర్కారు భారీగా నిధులు సమకూరుస్తుందని భావించారు. కొత్త మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగి మూడేళ్లు కావస్తున్నా ఇంకా ఒక గాడిలో పడలేదు. ఈ సమయంలో భారీ నిధుల విడుదలకు కేంద్రం సిద్ధపడింది. ఈ నేపథ్యంలో శక్తి సామర్ధ్యాలతో పాటు వ్యయంలో ఎక్కువ శాతం స్వయం సమృద్ధి సాధించిన వాటికే నిధుల విడుదలలో ప్రాముఖ్యం ఇస్తామని ప్రకటించింది. దాంతో భారీ బడ్జెట్‌కు అన్ని మున్సిపాలిటీలు రంగం సిద్ధం చేశాయి. జనవరిలో ఆమోదించిన మున్సిపల్ బడ్జెట్ 2017-18 ఏకంగా రూ.108.50 లక్షలకు చేర్చడం అందరికీ చర్చనీయాంశం అయ్యింది. ఇందులో రెవెన్యూ రాబడి రూ.4.45కోట్లలో 70శాతం రాబడి తేగలదా అన్నది అనుమానం. దాని సాధ్యాలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. వెనుకబడ్డ పురపాలికలు పుంజుకోవాలంటే అధికారుల జవాబుదారీతనం పెరగాలి. తినమరిగిన వారికి నెలవుగా మారిన పురపాలికలు తీరు మార్చుకోవాలి. ఆదాయ వ్యయాలు పారదర్శకంగా సాగాలి. ఆనాడు ఎగబడులు తగ్గి రాబడులు పెరుగుతాయి. దాన్ని గుర్తెరిగి మున్సిపాలిటీలు ప్రవర్తించిన నాడే సేవలు – నిధులు సక్రమంగా ప్రజలకు చేరుతాయి.


