సాయుధ దళాలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త !
- 29 Views
- admin
- May 4, 2017
- జాతీయం తాజా వార్తలు
న్యూఢిల్లీ : సాయుధ దళాలకు 7వ సెంట్రల్ పే కమిషన్ అమలుకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. సైనిక, నావిక, వాయు దళాలు గత ఏడాది తమ జీతాల్లో వైరుద్ధ్యాలను ఈ కమిషన్ సరిదిద్దలేదని ఆరోపించడంతో దీని అమలుపై ప్రభుత్వం ఇంతవరకు అనిశ్చితిలో ఉంది. రక్షణ శాఖ వర్గాల కథనం ప్రకారం మిగిలిన ప్రధాన వైరుద్ధ్యాలను వేర్వేరుగా పరిశీలించి, పరిష్కరిస్తామని ప్రభుత్వం సాయుధ దళాలకు హామీ ఇచ్చింది.
ఏడో వేతన సవరణ సంఘం సిఫారసులు 2016 జనవరి నుంచి అమల్లోకి వచ్చాయి. కానీ సాయుధ దళాలకు ఇంతవరకు అమలు కాలేదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ పాత బకాయిలను గత సెప్టెంబరులో పొందారు.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ సైనికులకు డిజెబిలిటీ పెన్షన్ను లెక్కించేందుకు పెర్సెంటేజ్ బేస్డ్ విధానాన్ని మళ్ళీ ఆమోదించింది. ఈవిధానాన్ని మార్చి స్లాబ్ బేస్డ్ విధానాన్ని అమలు చేయాలని 7వ వేతన సవరణ సంఘం సిఫారసు చేసినప్పటికీ ప్రభుత్వం పాత విధానంవైపే మొగ్గు చూపింది. ప్రస్తుత, భావి డిఫెన్స్ పెన్షనర్లకు ఈ నిర్ణయం వల్ల మేలు జరుగుతుంది. ప్రభుత్వంపై సంవత్సరానికి రూ.130 కోట్లు అదనపు భారం పడుతుంది.


