గూగుల్ ఉపాధ్యక్షుడితో చంద్రబాబు భేటీ గూగుల్ ఉపాధ్యక్షుడితో చంద్రబాబు భేటీ
- 15 Views
- admin
- May 5, 2017
- అంతర్జాతీయం జాతీయం తాజా వార్తలు రాష్ట్రీయం
వాషింగ్టన్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికాలో తొలిరోజు పర్యటన ముగిసింది. ఈ సందర్భంగా గూగుల్ ఉపాధ్యక్షుడు టామ్ మూర్.. చంద్రబాబుతో భేటీ అయి గూగుల్ ప్రస్తుత ఆవిష్కరణల గురించి వివరించారు. అనంతరం ప్లెక్స్ ట్రానిక్స్ సీఈవో మైక్ మెక్ సమరతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో వనరుల గురించి వివరించి పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. దీనిపై స్పందించిన మైక్ మెక్ విశాఖలో ఇప్పటికే తమ ఉనికి ఉందని గుర్తుచేశారు. భారత్‌లో సంస్థ విస్తరణకు గల అవకాశాలను పరిశీలిస్తామన్నారు.
మా రాష్ట్రానికి పెట్టుబడులతో రండి..! మరావతి: అమెరికా పర్యటనలో తొలిరోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బహుళజాతి సంస్థ ఫ్లెక్స్‌ట్రానిక్స్ సీఈఓ మైక్ మెక్‌నమరతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. అనంతరం కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్ ఎడ్మంట్ గెరాల్డ్ జెర్రీబ్రౌన్ని కలిశారు. వ్యవసాయ, పారిశ్రామిక, సాంకేతిక రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌కు కాలిఫోర్నియా నుంచి సహకారం ఆశిస్తున్నట్టు తెలిపారు. సెమీ కండక్టర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ (ఐపీ)లో ప్రపంచ అగ్రశ్రేణి సరఫరాదారుగా ఉన్న ఏఆర్ఎం హోల్డింగ్స్ సంస్థ సీఈఓ సైమన్ ఆంథోనీ సెగర్స్, గూగుల్ వైస్ ప్రెసిడెంట్ టామ్ మూర్, టెస్లా సంస్థ సీఎఫ్ఓ దీపక్ ఆహుజాతోను సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే తగిన సమయమని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రపంచంలోని రెండో అతి పెద్ద ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ సర్వీసెస్ సంస్థ ‘ఫ్లెక్స్ ట్రానిక్స్’కు ముఖ్యమంత్రి సూచించారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత (భారత కాలమానం ప్రకారం) ఆ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి మైక్ మెక్‌నమరతో ఆయన సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వనరులు, సానుకూలాంశాల గురించి వివరించారు.
ఆగ్నేయాసియా దేశాలకు రాకపోకలు సాగించేందుకు వీలుగా తమ రాష్ట్రం తీర ప్రాంతంలో ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. ఓడ రేవులు, విమానాశ్రయాలు, జల, ఇంధన, మానవ వనరులకు ఆంధ్రప్రదేశ్‌లో కొదవలేదన్నారు. వ్యాపార సరళీకరణలో దేశంలోనే మొదటిస్థానంలో ఉన్నామని, రాష్ట్రంలో మంచి పారిశ్రామిక వాతావరణం నెకొల్పామని ఆయన పేర్కొన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌లో పెట్టుబడులు పెట్టడం లాభసాటిగా ఉంటుందని, దానికి ఆంధ్రప్రదేశ్ అత్యంత అనుకూల ప్రదేశమని వివరించారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడంలో రాష్ట్రం ముందుందని, డిజిటల్ కరెన్సీపై సిఫారసులకు కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీకి తాను కన్వీనర్‌గా ఉన్నానని చంద్రబాబు తెలిపారు. తమ సంస్థ విస్తరణ ప్రణాళికలను మైక్ మెక్నమర వివరించారు. చంద్రబాబు ప్రతిపాదనల పట్ల సానుకూలంగా స్పందించారు. విశాఖలో ఇప్పటికే తమ కార్యకలాపాలు కొనసాగుతున్న విషయాన్ని గుర్తుచేశారు.
మీ సహకారం కావాలి..!
ఫ్లెక్స్‌ట్రానిక్స్ సీఈఓతో సమావేశం అనంతరం ముఖ్యమంత్రి శాక్రిమెంటో చేరుకున్నారు. కాలిఫోర్నియా గవర్నర్ అధికార నివాసానికి వెళ్లారు. పదిహేనేళ్లుగా గవర్నర్‌గా ఉన్న ఎడ్మంట్ గెరాల్డ్ జెర్రీబ్రౌన్తో భేటీ అయ్యారు. ఇద్దరి మధ్య రాజకీయాంశాలు ప్రస్తావనకు వచ్చాయి. జాతీయ రాజకీయాల్లో తెదేపా నిర్వహించిన క్రియాశీలకపాత్ర, కాంగ్రెసేతర ఉద్యమాల గురించి చంద్రబాబు వివరించారు. ప్రకృతి పరిరక్షణ కార్యక్రమాన్ని పౌరుల భాగస్వామ్యంతో ప్రజా ఉద్యమంగా మలిచామని తెలిపారు. పెద్ద ఎత్తున జలసంరక్షణ, వన సంరక్షణ కార్యక్రమాలు చేపట్టి, ఉష్ణోగ్రతలు తగ్గిస్తున్నామన్నారు. ఈ ప్రక్రియలో తమకు తోడ్పడాలని కోరారు. కొత్త రాజధాని అమరావతిని నిర్మాణ దశలోనే సందర్శించి తగు సూచనలు, సలహాలు అందించాలని గవర్నర్ బ్రౌన్‌ను చంద్రబాబు ఆహ్వానించారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి వెంట ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్, ఉన్నతాధికారులు ఉన్నారు.


