కశ్మీర్ అల్లరిమూకలను ఎదుర్కొనేందుకు ‘కాన్పూర్ జనసేన’ సైన్యం
- 10 Views
- admin
- May 6, 2017
- జాతీయం తాజా వార్తలు
కాన్ఫూర్: అల్లరిమూకల దాడులతో కశ్మీర్ నిత్యం ఉద్రిక్తంగానే ఉంటోంది. వేర్పాటువాదులిచ్చే కిరాయి తీసుకుని సైన్యంపై రాళ్లు రువ్వే ఘటనలు అక్కడ సర్వసాధారణం అయ్యాయి. వీరిని తరిమి కొట్టేందుకు సైనికులు పెల్లెట్ గన్స్ వాడుతున్నారు. అయినా అక్కడి యువత ఏ మాత్రం తగ్గకుండా, సైన్యంపై రాళ్లు రువ్వుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కాన్పూర్ కు చెందిన జనసేన సంస్థ ఓ సైన్యాన్ని తయారు చేసింది.
ఈ సైన్యంలో సాధువులు రాళ్లు రువ్వడంలో శిక్షణ పొందుతున్నారు. వీరిలో పురుషులతో పాటు మహిళలు కూడా ఉన్నారు. కశ్మీర్ లో సైన్యంపై రాళ్లు రువ్వుతున్న యువతను అడ్డుకునేందుకునే వీరు ట్రైనింగ్ పొందుతున్నారు. రేపు ఈ సైన్యానికి చెందిన వేలాది మంది కశ్మీర్ కు వెళుతున్నారు. రాళ్లు రువ్వుతూ, దేశ ఐక్యతను దెబ్బతీస్తున్న అక్కడి అల్లరిమూకలకు గట్టి గుణపాఠం నేర్పుతామని వీరు చెబుతున్నారు. మరి వీరి యత్నాలు ఎంతమేర ఫలితాన్ని ఇస్తాయో వేచి చూడాలి.
ఆర్ఎస్ఎస్ కు పోటీగా డీఎస్ఎస్!
పాట్నా: ఆర్ఎస్ఎస్కు పోటీగా డీఎస్ఎస్ను బీహర్ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ప్రారంభించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మత ఛాందసవాదాన్ని వ్యాపింపజేస్తోందని, విభజన వాదంతో దేశంలో చిచ్చురేపుతోందని… బహిరంగ ప్రదేశాల్లోనూ, వ్యక్తిగతంగానూ పరుష పదజాలం ఉపయోగిస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తోందని, అలాంటి ఆర్ఎస్ఎస్, బీజేపీలకు చెక్ చెప్పేందుకు భారత్ లో ఆ సంస్థ రేపే అల్లర్లను అడ్డుకునేందుకు బీహార్ వైద్య శాఖ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ తో కలిసి తాను ధర్మ నిరపేక్ష సేవక్ సంఘ్ (డీఎస్ఎస్) ను రూపొందించామని అన్నారు. ఆరెస్సెస్ అఘాయిత్యాలను తాము అడుగడుగునా అడ్డుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ సంస్థ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, కాషాయ పార్టీ నుంచి, ఆ పార్టీలోని సంకుచిత మనస్తత్వంగల నేతల నుంచి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కాకుండా ఇంకా గొప్పగా ఏమీ ఆశించలేమని అన్నారు.
ప్రశాంతంగా అన్నదమ్ముల్లా ఉన్న దేశ ప్రజల్లో ఆర్ఎస్ఎస్ చీలికలు తేవడమే లక్ష్యంగా పని చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ కేవలం హిందువులకు మాత్రమే మద్దతిస్తుందని, ఇతర మతాలు, అంశాలకు అనుకూలంగా ఎన్నడూ పెదవి విప్పదని ఆయన తెలిపారు. అలాగే ఇతర మతాలకు సంబంధించిన అంశాలు చర్చకు వచ్చినప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్ పరస్పరం సహకరించుకుంటాయని ఆయన తెలిపారు. ఇలాంటి విధానాలు సరికాదని… దేశ ప్రజలంతా సమానమేనని, వారి మధ్య మతాలు, కులాల పేరిట అడ్డుగోడలు సరికాదని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి విధానానికి ఆర్ఎస్ఎస్ వ్యతిరేకమని, అందుకే దానిని నిలువరించేందుకు డీఎస్ఎస్ ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు.


