శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు వరుస దోపిడీలతో భయపడిపోయిన బ్యాంకు సిబ్బంది నగదు లావాదేవీలను నిలిపివేశారు. దక్షిణ కశ్మీర్‌లోని 40 బ్రాంచ్‌ల్లో నగదు లావాదేవీలు నిలిపివేసినట్లు సీనియర్ బ్యాంకు అధికారి ఒకరు స్థానిక మీడియాకు వెల్లడించారు. ఒక వేళ ఖాతాదారుడు నగదు డిపాజిట్ చేయాలనుకుంటే చెక్కు రూపంలోనే చేయాలని, నగదు బదిలీ చేయాలన్నా ఈ పద్ధతిలోనే చేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. నగదు లావాదేవీలు మినహా మిగతా అన్ని పనులు యథాప్రకారం జరుగుతాయని ఆయన అన్నారు. నగదు కావాల్సి వస్తే బ్యాంకు ఖాతాదారులు దగ్గర్లోనే సురక్షితమైన బ్రాంచ్‌ల్లో సంప్రదించాలని పేర్కొన్నారు. పుల్వామా, షోపియన్ జిల్లాలకు చెందిన బ్యాంకుల్లోనే ఎక్కువగా నగదు లావాదేవీలు నిలిపివేశారు.గత వారం రోజుల్లోనే నాలుగు బ్యాంకులు, నగదు వ్యానుపై ఉగ్రవాదులు దాడులు చేసి నగదును దోచుకున్నారు. రెండు రోజుల క్రితం కేవలం రెండు గంటల వ్యవధిలోనే వేర్వేరు బ్యాంకుల్లో ఉగ్రవాదులు తుపాకీలతో సిబ్బందిని బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. హిజ్బుల్ ముజాహిద్దీన్, లష్కరే తోయిబా సంస్థలకు చెందిన ఉగ్రవాదులు ఈ దోపిడీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.