రెవెన్యూ అధికారులా? భూ బకాసురులా?
- 25 Views
- admin
- May 6, 2017
- తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
ప్రభుత్వ భూములకు రక్షణ కరవు – ఆర్టీఐతో రూ.6కోట్ల కుంభకోణం వెలుగులోకి
బరితెగించిన రెవిన్యూ అధికారి – షోకాజ్ నోటీసు జారీ చేసిన జాయింట్ కలెక్టర్
అనకాపల్లి, ఫీచర్స్ ఇండియా: రెవెన్యూ అధికారుల బరితెగింపు మరోసారి జిల్లా అధికార యంత్రాంగానికి షాకిచ్చింది. అవినీతికి దూరంగా ఉండండి.. అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవనే జిల్లా కలెక్టర్ హెచ్చరికలు బేఖాతరయ్యాయి. ప్రభుత్వ భూమికి రక్షణగా ఉండాల్సిన రెవెన్యూ అధికారులే భక్షకులుగా మారి ప్రభుత్వ భూమిని సార్కారుకే బేరం పెట్టిన తహశీల్దార్ బరితెగింపు వైనం జిల్లాలో రెవెన్యూ శాఖ పనితీరుకు అద్దం పడుతోంది. ప్రభుత్వ భూమిని జిరాయితీగా చూపిస్తూ రూ.6కోట్లను ప్రభుత్వం నుంచి కొట్టేయడానికి పక్కాగా వేసిన స్కెచ్ వెనుక ఒక ప్రజాప్రతినిధి, ప్రభుత్వాధికారి పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అనకాపల్లి మండలం కోడూరు గ్రామ పంచాయితీ సర్వే నెం.20లో 39.38 ఎకరాల కొండ పోరంబోకు స్థలం ఉంది. ఈ ప్రాంతంలో ప్రభుత్వం భూసేకరణ కార్యక్రమం చేపట్టింది. ప్రైవేట్ భూములకు పరిహారం ఇవ్వడమే కాకుండా ప్రభుత్వ భూముల్లో ఉండే ఆక్రమణదారులకు కూడా పరిహారాన్ని అందజేయాలని జిల్లా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ భూములపై స్థానిక ప్రజాప్రతినిధుల కన్ను పడింది. రెవెన్యూ అధికారులతో మంతనాలు జరిగాయి. దీంతో రాత్రికి రాత్రే రెవెన్యూ రికార్డులు మారిపోయాయి. ఖాళీగా ఉన్న ఈ స్థలంలో 47మంది ఆక్రమణదారులు పుట్టుకొచ్చారు. చాలా కాలంగా ఈ భూములు తాము సాగుచేస్తున్నామని, పరిహారం ఇప్పించాలని వీరు అధికారులను కోరారు. మండల తహశీల్దార్ పీ కృష్ణమూర్తి, దీనికి రూ.6కోట్లు చెల్లించాలని నివేదిక తయారు చేసి జిల్లా కలెక్టర్కు పంపారు. తన నివేదికను గ్రామంలో దండోరా చేయించినట్టు, గ్రామ సభ నిర్వహించినట్టు, ఈ సభలో ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, సర్పంచ్, ఎంపిటీసీ, ఆర్ఐ, వీఆర్వో, జన్మభూమి కమిటి సభ్యులు పాల్గొన్నట్లు వారి సంతకాలతో నివేదికను తహశీల్దార్ పంపారు.
భాగోతం బయటపడిందిలా
ప్రభుత్వ భూమికి రెవెన్యూ అధికారులతో కలిసి ఒక ప్రజా ప్రతినిధి పక్కాగా స్కెచ్ వేశారని, రెవెన్యూ వర్గాల్లో గుప్పుమంది. విషయాన్ని కొందరు అజ్ఞాత వ్యక్తులు ఇటీవల బదిలీ అయిన ఆర్డీవోకి తెలిసినా పట్టించుకోలేదు. దీంతో కుంభకోణాన్ని బయటపెట్టాలనే ఉద్దేశ్యంతో కొందరు ఆర్టిఐ ఉద్యమకర్త కాండ్రేగుల వెంకటరమణకు ఈ విషయాన్ని తెలిపారు. ఆయన సమాచార హక్కుచట్టం కింద వివరాలు సేకరించడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి ఈ భూమి అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు 2011లో అప్పటి జాయింట్ కలెక్టర్ నివాస్, ఈ భూములు పరిశీలించి చుట్టూ దిమ్మలు, కంచే వేయించి దీనిని పరిరక్షించాలంటూ గ్రామ వీఆర్వోకు బాధ్యతలు అప్పగించారు. సమాచార హక్కుచట్టం ద్వారా లభ్యమైన వివరాలను కాండ్రేగుల వెంకటరమణ, జాయింట్ కలెక్టర్ సృజనకు ఈ వివరాలను అందజేశారు. దీంతో ఆమె గత రికార్డులను పరిశీలించి, కుంభకోణం జరిగిందని గుర్తించారు. వెంటనే రంగంలోకి దిగిన ఆమె తహశీల్దార్ కృష్ణమూర్తికి షోకాజు నోటీసు (ఆర్సి నెం.915/2015)ను గత 14న జారీ చేశారు. ఆక్రమణదారులు ఈ భూమిలోకి ఎలా? ఎప్పుడు ప్రవేశించారని? రెవెన్యూ రికార్డుల్లో ఏ విధంగా నమోదు చేశారని? అసలు ఆక్రమణదారులు ఏ ప్రాంతం వారని? షోకాజు నోటీసులో ప్రశ్నించడంతో దిమ్మతిరిగిన తహశీల్దార్ దీర్ఘకాలం సెలవు పెట్టి వెళ్లిపోయారు. కాగా ఈ భూ భాగోతం వెనుక ఆర్డీవో హస్తం ఉందని, ఆమె హయాంలో చేపట్టిన కార్యక్రమాలన్నింటిపై విచారణ జరిపించలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి.


