లీగ్ చివరి దశకు చేరుకున్న ఊర్జ సీఏపీఎఫ్ ఫుట్‌బాల్ టోర్నీ
- 12 Views
- admin
- May 6, 2017
- జాతీయం తాజా వార్తలు రాష్ట్రీయం సినిమా స్థానికం
శ్రీ సెమీస్‌కు చేరువలో ఏఫీఎఫ్ఎ వన్ బాలుర బాలికల జట్లు శ్రీ ఊర్జ టోర్నీతో
ఫుట్‌బాల్‌కు కొత్త పుంతలు : ద్రోణాచార్య ప్రసాదరావు
విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా: ఊర్జ సీఏపీఎఫ్ ఫుట్‌బాల్ టోర్నీ లీగ్ దశ చివరి అంకానికి చేరుకుంది. ఆదివారం సాయంత్రంతో లీగ్ దశ ముగుస్తుంది. ఎనిమిది బాలుర, ఎనిమిది బాలికల జట్లు టైటిల్ కోసం పోటీ పడుతున్నాయి. ఇప్పటికే రెండు గ్రూపులలో రెండు జట్లు నిష్క్రమించాయి. మరో రెండు జట్ల కథ ఆదివారం సాయంత్రంతో ముగియనున్నది. సోమవారం సెమీ ఫైనల్స్, బుధవారం ఫైనల్ నిర్వహిస్తారు. నేవీ గ్రౌండ్లో జరుగుతున్న ఊర్జ సీఏపీఎఫ్ ఫుట్‌బాల్ టోర్నీలో శనివారం సాయంత్రం వరకు 20 మ్యాచ్‌లు జరిగాయి. కేంద్రీయ విద్యాలయ సంఘటన్ వన్, టూ బాల బాలికల జట్లు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించకపోవడంతో టోర్నీ నుంచి వైదొలిగాయి.
ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ (ఏపీఎఫ్‌ఏ) వన్, త్రీ బాలికల జట్ల శనివారం ఉదయం తలపడ్డాయి. నేవీ గ్రౌండ్లో హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ఏపీఎఫ్‌ఏ వన్ జట్టుదే పై చేయి అయ్యింది. ఏపీఎఫ్ఐ త్రీ జట్టు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ ఫలితం లేకపోయింది. రియా డి.కోస్తా ఆట ప్రథమార్ధంలో రెండు, ద్వితీయార్ధంలో రెండు మొత్తం నాలుగు గోల్స్ చేసి జట్టుకు విజయాన్ని అందించారు. ఆట ప్రారంభమైన 15వ నిమిషంలోనే గోల్ చేసిన రియా ఆ తరువాత 27వ నిమిషంలో గోల్స్ చేశారు. ద్వితీయార్ధంలోని 55,65 నిమిషాలలో గోల్స్ చేసి జట్టును విజయం వైపు తీసుకువెళ్లారు. మరో క్రీడాకారిణి మానస 53వ నిమిషంలో గోల్ చేయడంతో ఏపీఎఫ్‌ఏ జట్టు అయిదు గోల్స్ తేడాతో గెలుపొందింది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఏపీఎఫ్‌ఏ వన్ జట్టు విజయం సాధించి సెమీస్‌లో బెర్తు ఖరారు చేసుకుంది.
మరో మ్యాచ్‌లో ఏపీఎఫ్‌ఏ వన్, ఏపీఎఫ్‌ఏ త్రీ బాలుర జట్లు పోటీ పడ్డాయి. ఈ మ్యాచ్ కూడా హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో రెండు జట్లు గోల్ కోసం పోటీగా ప్రయత్నించాయి. ఆట ప్రథమార్థం 31వ నిమిషంలో నివాస్ వేసిన గోల్ ఏపీఎఫ్‌ఏ వన్ జట్టులో ఉత్సాహాన్ని నింపింది. అదే స్పూర్తిగా ఆద్యంతం మ్యాచ్ ఆడారు. వారికి ధీటుగా ఏపీఎఫ్‌ఏ త్రీ జట్టు ఆడినప్పటికీ గోల్స్ చేయలేకపోయింది. దీంతో 1 0 గోల్స్ తేడాతో వన్ జట్టు గెలుపొందింది.
శనివారం నాటి పోటీలను అర్జున, ద్రోణాచార్య పురస్కార గ్రహీత, సీనియర్ కబడ్డీ కోచ్ ఈ. ప్రసాదరావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఊర్జ టోర్నీ ఫుట్‌బాల్‌ను కొత్త పుంతలు తొక్కిస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చక్కటి ఈ నిర్ణయం దేశ ఫుట్‌బాల్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్‌లో ఈ ఏడాది చివరిలో జరిగే ఫీఫా 2017 వరల్డ్ కప్ ఫుట్‌బాల్ పోటీలకు క్షేత్ర స్థాయిలో ఎంపిక జరగడం సంతోషంగా ఉందని అన్నారు. జిల్లా, రాష్ట్ర, దక్షిణ భారత స్థాయి చివరిగా జాతీయ స్థాయిలో ఎంపిక నిర్వహించడం శుభపరిణామని పేర్కొన్నారు. ఈ తరహా ఎంపిక వల్ల ఫీఫా వరల్డ్ కప్‌లో భారత్ సముచితమైన స్థానం సంపాదిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మరో అతిధి సీనియర్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు ఆర్. రామలింగేశ్వరరావు మాట్లాడుతూ, ఫుట్‌బాల్‌కు ఫూర్వ వైభవం రావాలంటే ఇలాంటి పోటీలు జరగాలని అన్నారు. విశాఖపట్నం విషయానికి వస్తే ఫుట్‌బాల్ కోసం మైదానాలు లేకపోడం పెద్ద లోటు అని పేర్కొన్నారు. గతంలో ఫుట్‌బాల్ అంటే విశాఖపట్నం పేరు గుర్తుకు వచ్చేదని, అదే పరిస్థితి తిరిగి రావాలని కోరుకుంటున్నానని చెప్పారు.
– ఎన్.నాగేశ్వరరావు


