సప్తపది.. క్రైం స్టోరీ
- 10 Views
- admin
- May 6, 2017
- తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
రావులవలస రామచంద్రరావు
పెళ్లంటే నూరేళ్ల పంట. అందుకే వేదమంత్రాలు, బంధు మిత్రుల ఆశీస్సుల మద్య దైవ క్రుప లభిస్తుందని వేడుకగా నిర్వహిస్తారు. వైవాహిక జీవన ప్రయాణంలో కొన్ని కష్టాలు, సుఖాలు వస్తాయి. అందులో ఆర్థికపరమైన అంశాలు కూడా. సుఖాలు మాదిరిగానే కష్టాల వేళ కూడా కలిసి ఉండాల్సిన భార్యా భర్తల ఆలోచనలు మారితే జీవితం చీకటి మయమవుతోంది. నేరాలు, నేర ఘటనలపై ప్రజలను అప్రమత్తం చేసే క్రమంలో ఫీచర్స్ ఇండియా ప్రతీ వారం ఇచ్చే క్రైం కథ. సప్తపది …
…….
మంగళావాయుద్యాల మద్య పండితులు మంత్రోశ్చరణ చేస్తున్నారు…
మాంగళ్య తంతునానేన మమజీవన హేతునా, కంఠే బద్నామి సుభగే త్వంజీవశరద:శ్యతమ్ దీని అర్థం ఏమంటే నా జీవితానికి మూలమైన హేతువైన ఈ సూత్రమును నీ కంఠమున నేను కట్టుచున్నాను. నీవు నాతో నూరు సంవత్సరాలు జీవించాలని వరుడు మాంగళ్య సూత్రధారణ గావిస్తాడు.. వివరించారు పండితులు.
వరుడు వెంకట్రావు వధువు సావిత్రి మెడలో మూడు ముళ్లు వేశారు.
వెంకట్రావు రైల్వే ఉద్యోగి. శ్రీకాకుళం జిల్లాలో పుట్టినా ఉద్యోగం రీత్యా రైల్వే న్యూకాలనీలో ఉంటున్నారు. గడియారంలో ఆగని ముళ్లు ఆ ఇద్దరి వైవాహిక జీవితాన్ని ఇరవైయేళ్లు ముందుకు తీసుకువెళ్లాయి. వీరికి ఇద్దరు పిల్లలు. కాలేజీ వయసు దాటారు. వృత్తి రీత్యా నిత్యం బిజీగా ఉండే వెంకట్రావుకు ఇంటి విషయాలు అంతగా పట్టించుకునే ఆలోచనలు లేవు. అంతా అతని భార్య సావిత్రి చూసుకునేది. పిల్లల చదువుల కంటే ఆమెకు సంపాదనపై ఎక్కువ ధ్యాస పెట్టింది. అందుకు భర్తతో సంబంధం లేకుండా కొత్త మార్గాలను అన్వేషించింది.
సావిత్రమ్మ సహజంగానే అందగత్తె. ఆమెను చూస్తే మరో సారి చూడాలని అనిపిస్తుంది. దీనికి తగ్గట్టు ఆమె కూడా రోజూ అలంకరించుకుంటుంది. జెడ నిండా పూలు, నుదుటి కుంకుమతో ఆమెలో స్త్రీ తత్వం కనిపిస్తుంది. నలభై యేళ్ల వయసులో కూడా కంటికి కాటుక అద్దడం ఆమెలో ప్రత్యేకత. కంటి చిగురు వరకు వచ్చే ఈ కాటుకను నిశితంగా చూసే మనసు మరో ఆలోచనలోకి తీసుకువెళ్తుంది.
ఓ రోజు బంధువులు వచ్చారని ఆర్టీసీ కాంప్లెక్సుకు వెళ్లింది. ఆటో ఎక్కినప్పుడు పరిచమయ్యాడు ఈశ్వర్రావు. శ్రీకాకుళం జిల్లానే కానీ పొట్ట కూటి కోసం ముప్పై సంవత్సరాల క్రితమే వైజాగ్ వచ్చేశాను. ఐటీఐ జంక్షన్లో ఉంటున్నానని చెప్పాడు. డబ్బులు ఇచ్చే టప్పుడు ఆమె కళ్లల్లోకి చూసిన ఈశ్వర్రావు ఏదైనా పని ఉంటే చెప్పండి వస్తాను ఒకే జిల్లావాళ్లం కదా డబ్బులకేం ఉంది అన్నాడు.
అలాగే అయితే ఉండు.. మా చుట్టాలు బస్సు దిగితే ఇంటికి తీసుకువెళ్దువు సామిత్రమ్మ చెప్పింది. బస్సు వచ్చే వరకు ఆటోలోనే కూర్చొంది. ఆ మాటలు ఈ మాటలు మద్య బంధువులు వచ్చారు. ఇంటికి దిగబెట్టాడు. ఆ తరువాత నుంచి ఈశ్వర్రావు సావిత్రి ఇంటికి వెళ్లడం, పూర్ణామార్కెట్ నుండి కిరాణా సామాన్లు తేవడం లాంటి సహాయం చేసేవాడు. ఆటో డ్రైవర్ మాత్రమే కాదు ఇప్పుడు ఓ చుట్టం మాదిరిగా వెంకట్రావు ఇంట్లో మారాడు ఈశ్వర్రావు.
—
ఏమే కుమారి… ఇంత అందంగా ఉన్నావు. మీ ఆయన ఇంటికి వేగంగా వచ్చేయమన్నాడా.. వెంకట్రావు పనిమనిషి లక్ష్మీతో అన్నాడు. లేదండీ ఇంటికి
వస్తున్నప్పుడు సైకిల్ మీద వచ్చాయి. మూరడు మల్లె పూలు కొనుకున్నా. అందుకే మీ ఆయన నిన్ను వదలడే.
ఊరుకోండయ్యా.. మాటలు అమ్మగారు విన్నారంటే మీకు నాకు అయి పోతుంది. లక్ష్మీ వెంకట్రావును చిన్నగా మందలించింది.
వెంకట్రావు మాత్రం ఆగలేదు. వంట గదిలో గిన్నెలు సర్దుతున్న ఆమె నడుం పై చేయి వేశాడు. ఆ సరసరాలు మరింత దగ్గర చేశాయి.
లక్ష్మీ నెల రోజుల క్రితమే వెంకట్రావు ఇంట్లో పనికి చేరింది. కష్టపడే శరీరంతో గట్టిదనం కూడా కనిపిస్తుంది. అందుకే యాభై సంవత్సరాల వయసులోని వెంకట్రావు పనిమనిషి వెంట పడ్డాడు. భార్యా పిల్లలు పక్కకు వెళ్లిన సమయంలో ఆమెతో సరసరాలు ఆడుతుండేవాడు.
ఆ రోజు రాత్రి 9 గంటలైంది. ఇంకా ఉండిపోయావా? నా కోసమేనా వెంకట్రావు మాటలు కలిపాడు.
కాదండీ అమ్మగారు చాలా పని పెట్టారు. అందుకే .. మరి ఇంత సేపు బాగా చీకటి పడింది. రోడ్డు వరకు తోడు వస్తారా?. ఆటో ఎక్కేస్తాను చనువుతో అడిగింది.
అలాంటి అవకాశం కోసమే చూస్తున్న వెంకట్రావు అలాగే నాకు మరి ఏదైనా ఇవ్వొచ్చు కదా.
వెంకట్రావు ఉంటున్న క్వార్టర్స్ పక్కనే రోడ్డు. పనిమనిషి లక్ష్మీని తీసుకువెళ్లేందుకు వెళ్లాడు. ఆటో రాలేదు. చీకటిగా ఉంది. అదే అవకాశంగా దగ్గరకు వెళ్లాడు.
ఆమె కూడా దగ్గరైంది. నెల రోజుల్లో పరిచయంతో చేయి పట్టుకున్నాడు. పక్కనే ఉన్న గ్రౌండ్లోకి వారి అడుగులు పడ్డాయి. చీకటి పొదలు.. కానీ కోరిక సౌకర్యాలను చూడదంటారు. దగ్గరయ్యారు. అప్పుడే దబ్…దబ్ మని ఇనుప రాడ్డుతో వెంకట్రావుపై దెబ్బలు పడ్డాయి. కళ్లు బైర్లు కమ్మాయి. ఏం జరుగుతుందో తెలుసుకునే సరికి కళ్లు మూతలు పడ్డాయి. ఇక తెరుచుకోలేదు.
24 గంటల తరువాత అటుగా ఆడుకుంటున్న పిల్లలకు వెంకట్రావు శవం కనిపించింది. పోలీసులు, పత్రికా విలేకర్లు వచ్చారు. రైల్వే ఉద్యోగి హత్య? శరీరంపై ఉన్న గాయాల బట్టి పోలీసులు నిర్థారించారు. హత్యకు ఇంటికి మద్య రోడ్డు మాత్రమే. ఇంటి కిటికీలో నుంచి చూస్తే కనిపించే ప్రదేశంలోనే వెంకట్రావు హత్యకు గురయ్యాడు. పోలీసుల శోధన మొదలైంది. పోలీసు జాగిలాలు హత్యా స్థలం నుంచి ఇంటి వరకు వెళ్లాయి. కుటుంబ సభ్యుల్ని విచారించారు సావిత్రి భోరున విలపిస్తోంది. భర్త మరణంతో. పిల్లలు ఆమెను ఓదార్చుతున్నారు. పోలీసుల ప్రశ్నలు ఆమెలో కోపం తెప్పిస్తున్నాయి. అదే సమయంలో వెంకట్రావు ఫోటో ఉందా అని విలేకరి ఈశ్వర్రావు అడిగాడు. మా బాధల్లో ఉంటే ఇదేంటని కస్పు మంది.
ఎస్ఐ. పురుషోత్తం రిటైర్మెంట్కు దగ్గరగా వచ్చారు. కానిస్టేబుల్ దశ నుంచి తనకు ఉన్న అనుభవంతో కేసు విచారణ సాగిస్తున్నారు. కుటుంబసభ్యుల గురించి ఆరా తీశారు. కానీ వారి గురించి క్వార్టర్స్ లోఇతరులకు తెలిసిన సమాచారం తక్కువ. ఇతరులతో సంబంధాలు తక్కువ. కానీ తరచూ కొత్త మనుషులు వస్తుంటారని మాత్రం చెప్పారు. ఎలా అంటే ఆటోలో. అదీ ఒకే ఆటోలో .. కొంత సమయం వచ్చి వెళ్లి పోతుంటారని చెప్పారు.
—
కంచరపాలెం పోలీసు స్టేషన్‌కు ఆటోతో వచ్చాడు. ఈశ్వర్రావు. పాత నేరస్థుడే.. ఇనుప ముక్కలు అప్పుడప్పుడు తరలిస్తుంటాడు. వెంకట్రావు మరణం గురించి ప్రశ్నించారు. తనకు బాగా తెలిసినోళ్లు చాలా కాలం నుంచి ఇంటి అవసరాల కోసం వెళ్తుంటానని వివరించాడు. మరి ఆ ఇంటికి మనుషులు వస్తుంటారట.. నీ ఆటోలోనే క్వార్టర్స్ లో వాళ్లు చెప్పారు ఎస్ఐ అడిగారు. లేదండీ కాలేజీ పిల్లలు బయట ఊరు నుంచి పరీక్షలకు వస్తే అలా వస్తుంటారు వెళ్లి పోతారు. లాడ్జిలో ఉంటే డబ్బులు ఇచ్చుకోలేరు కదా/
ఎస్ఐ. పురుషోత్తం కూడా ఆ మాటల్లో తేడా కనిపించింది. పరీక్షలకు వచ్చే పిల్లలకు ఇక్కడ ఆశ్రయం ఇవ్వడం ఏంటని అందులో నేర చరిత్ర ఉన్న ఈశ్వర్రావుతో.
విచారణలో మార్పు వచ్చింది. లాఠీ దెబ్బ తగిలింది ఈశ్వర్రావుకు. కొంత సేపటికి సర్ చెప్తాను.. కొట్టకండీ అన్నాడు.
—
ఓ రోజు ఆటోలో పరిచయమైన వెంకట్రావు భార్య సావిత్రి అవసరమైనప్పుడు సహాయపడుతుండేవారు. అప్పుడు కొన్ని సార్లు భర్త సంపాదన చాలడం లేదని చెప్పింది. రైల్వే స్టేషన్‌కు వచ్చే పాసింజర్లను తెస్తాను కొంత సేపు ఉండి వెళ్లిపోతారు. నాకు కొంత వస్తుంది. మీకు కొంత ఇవ్వొచ్చని చెప్పాను. అలా ఆటోలో వచ్చే వారిని క్వార్టర్స్‌కు తీసుకువెళ్లే వాడ్ని. ఆ ఇంట్లో ఓ గది ఇచ్చేవారు. ఎవరికి అనుమానం లేదు. బంధువులు అనుకునేవారు. అలా కొన్ని జంటలు కూడా
వస్తుండేవి. ఈ విషయం వెంకట్రావు గారికి తెలిసింది. ఒప్పుకోలేదు. భార్యా భర్తల మద్య గొడవలు మొదలయ్యాయి. సావిత్రమ్మ భర్తను లెక్క చేయలేదు. తనకు నచ్చిన తీరున నడవడం మొదలు పెట్టింది. ఓ రోజు వెంకట్రావు భార్యను కొట్టాడు. దీంతో ఆమె మనసులో ఆలోచనలు మారాయి. ఇతనితో కాపురం కంటే మరో మార్గం మంచిందని నిర్ణయించింది. ఆమె చెప్పినట్టు వాళ్లింట్లో మా చెల్లిని పనిమనిషిగా పెట్టాను. వెంకట్రావుకు దగ్గరగా ఉండేందుకు అతని భార్య అవకాశం ఇచ్చేది. అలా అతను కూడా మా చెల్లికి దగ్గరయ్యాడు. ఆమెకు చెప్పి వెంకట్రావును రైల్వే గ్రౌండ్స్ లోకి తీసుకు వస్తే చంపేయవచ్చని చెప్పాం. అలాగే ఆటో ఎక్కించే క్రమంలో వచ్చిన వెంకట్రావును రాడ్ తో కొట్టి చంపేశామని పోలీసులకు వివరించాడు ఆటో డ్రైవర్ ఈశ్వర్రావు.
మరి ఇలా చంపితే నీకేంటి ..పురుషోత్తం అడిగారు.
సర్.. నాకు 5 వేలు ఇస్తామని చెప్పారు. వెంకట్రావు చనిపోతే గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తాయి.. వాళ్లబ్బాయికి ఉద్యోగం వస్తుందని ఆవిడ చెప్పారు. పాత నేరస్థుడు మరో నేరం చేశాడు.
కేసు చిక్కు ముడి వీడింది. ఆటోడ్రైవర్ ఈశ్వర్రావుతో పాటు హతుడు భార్య సావిత్రిని హత్యకు సహకరించిన పనిమనిషి లక్ష్మీని అరెస్టు చేశారు.
—
స్టేషన్ రోడ్డులోని శ్రీనివాసా కళ్యాణ మండపంలో పెళ్లి జరుగుతోంది. సప్తపది అంటే వధూవరులు నిలబడి, ఒక్కో అడుగు వేస్తూ దేవశక్తి మంత్రాలను పఠిస్తారు.
ప్రాణాళిక బద్దంగా ప్రగతి శీలమైన జీవనము కొరకు అగ్ని సాక్షిగా సంకల్పం తీసుకుంటారు. దైవానుగ్రహం జీవితమంతా లభిస్తుందని ఏడడుగులు వేస్తారు. దీన్నే
సప్తపది అంటారు కొత్త జంటకు పండితులు వివరిస్తున్నారు.
ఆ పక్క రోడ్డు నుంచి భర్తను చంపించిన సావిత్రమ్మను ఆటోలో కోర్టుకు తీసుకువెళ్తున్నారు పోలీసులు.


