రూ.1000 కోట్ల గ్రాస్.. బాలీవుడ్ సినిమాలకే సాధ్యం కాని ఘనత ఇది. కేవలం పదే పది రోజుల్లో ఈ మైలురాయిని అందుకుని సంచలనం సృష్టించింది ‘బాహుబలి: ది కంక్లూజన్’. ఈ సినిమా వెయ్యి కోట్ల మార్కును అందుకుంటున్నది ఊహించిన విషయమే కానీ.. మరీ ఇంత వేగంగా ఆ ఘనత అందుతుందని ఎవ్వరూ అనుకోలేదు.
సెకండ్ వీకెండ్ పూర్తి కాకముందే వరల్డ్ వైడ్ రూ.1000 కోట్ల గ్రాస్ సాధించిన ‘బాహుబలి-2’ ఫుల్ రన్లో రూ.1500 కోట్ల మార్కును అందుకున్నా ఆశ్చర్యం లేదేమో. విశేషం ఏంటంటే.. ఇక్కడ ‘బాహుబలి-2’ వరల్డ్ వైడ్ వసూళ్లు రూ.1000 కోట్లకు చేరిన రోజే.. అమెరికాలో ఈ సినిమా రూ.100 కోట్ల మైలురాయిని అందుకోవడం విశేషం.
సెకండ్ వీకెండ్లో సైతం అమెరికాలో ప్రభంజనం సృష్టించిన ‘బాహుబలి: ది కంక్లూజన్’ ఆదివారం మార్నింగ్ షోలకే రూ.100 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టేసింది. శనివారం ఈ సినిమా 1.2 మిలియన్ డాలర్ల వరకు వసూలు చేయడం అనూహ్యమే. సెకండ్ వీకెండ్లో సైతం ఒక్క రోజులో మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేయడమంటే చిన్న విషయం కాదు.
ఆదివారం ఓవరాల్ కలెక్షన్లు 15 మిలియన్ డాలర్ల మార్కును దాటేశాయి. ఫుల్ రన్లో ఈ వసూళ్లు సాధిస్తే చాలని డిస్ట్రిబ్యూటర్ ఆశపడితే.. రెండో వీకెండ్‌కే ఆ మార్కు టచ్ చేసేసింది ‘బాహుబలి-2’. దీంతో బయ్యర్ లాభాల బాట పట్టేసింది. ఫుల్ రన్లో ఈ చిత్రం అమెరికాలో 20 మిలియన్ డాలర్లకు చేరువగా వెళ్లే అవకాశముంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో సెకండ్ వీకెండ్ అయ్యేసరికి బాహుబలి-2 వసూళ్లు రూ.150 కోట్ల షేర్ మార్కును దాటుతాయని అంచనా వేస్తున్నారు.