తెలుగు సినీ పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుల్లో కె.విశ్వనాథ్ ఒకరు. ఆయన ఎంత గొప్ప సినిమాలు తీశారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తనతో స్వయంకృషి, ఆపద్బాంధవుడు లాంటి గొప్ప సినిమాలు తీసిన విశ్వనాథ్ అంటే మెగాస్టార్ చిరంజీవికి ఎంత గౌరవమో అందరికీ తెలుసు. మొన్న ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డు వచ్చినపుడు కూడా విశ్వనాథ్ ముందు చిరు ఎంత గౌరవభావంతో వ్యవహరించాడో అందరూ చూశారు. ఐతే అలాంటి చిరంజీవి.. ఒక టైంలో విశ్వనాథ్‌ను ఒక విషయంలో హెచ్చరించారట. ఆ హెచ్చరిక తర్వాత తాను చాలా జాగ్రత్తగా ఉంటున్నానని అన్నారు విశ్వనాథ్. ఇంతకీ ఆ హెచ్చరిక ఏంటో విశ్వనాథ్ మాటల్లోనే తెలుసుకుందాం రండి.
‘‘నేనో సినిమా కోసం గుడిలో షూటింగ్ చేస్తుండగా.. ఒకరిద్దరు పాత్రికేయులు సినిమా ప్రోగ్రెస్ గురించి తెలుసుకోవాలనుకున్నారు. వాళ్లను కొంచెం వెయిట్ చేయించి విరామ సమయంలో వాళ్లతో మాట్లాడాను. ఆ సందర్భంగా నా సినిమాల్లో నటించే నటీనటులు భిన్నంగా కనిపిస్తారని.. అది నా అదృష్టమని అన్నాను. అలాగే సినిమా షూటింగ్ టైంలో కొందరు వచ్చి పాదాభివందనం చేస్తుంటారని.. అది నాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని కూడా వ్యాఖ్యానించాను. ఐతే నేను అన్న మాటలు పత్రికలో మరోలా వచ్చాయి. ‘నా సినిమాలో నటించిన నటీనటులు చాలా భిన్నంగా ఉంటారు. నా సినిమాల్లో మాత్రమే ఇలా జరుగుతుంది’.. ‘పాదాభివనందనం చేయించుకునే దర్శకుడిని నేనొక్కడినే’ అనే తరహాలో నా మాటల్ని ఉటంకించారు. దీనిపై చిరంజీవి నన్ను హెచ్చరించారు. మీరు ఇలా అని ఉండరు అని చెబుతూనే.. కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు. అప్పట్నుంచి మీడియా వాళ్లతో చాలా జాగ్రత్తగా ఉంటున్నా’’ అని ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ తనను సత్కరించిన సందర్భంగా విశ్వనాథ్ అన్నారు.