సందిగ్ధతకు తెరపడింది. చాంపియన్స్ ట్రోఫీలో భారత్ ప్రాతినిధ్యం వహిస్తుందా లేదా అన్న అనుమానాలకు
ఫుల్స్టాప్ పడింది. రెవెన్యూ మోడల్ విషయంలో ఐసీసీతో పంతానికి పోకుండా సఖ్యతతో మెలుగాలన్న సీవోఏ ఆదేశానుసారం వెనుకకు తగ్గిన బీసీసీఐ.. మినీ ప్రపంచకప్పుగా భావించే చాంపియన్స్ ట్రోఫీకి మన సైన్యాన్ని సిద్ధం చేసింది. ఊహించినట్లుగానే ఎలాంటి సంచలన నిర్ణయాలకు తావులేకుండా సెలెక్షన్ కమిటీ 15 మందితో కూడిన భారత జట్టును సోమవారం ప్రకటించింది.
-రోహిత్, షమీ రిటర్న్స్
-రిజర్వ్‌గా రైనా,రిషబ్, దినేశ్, కుల్దీప్, శార్దుల్
-చాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు
న్యూఢిల్లీ: క్రికెట్ వీరాభిమానులకు కిక్కిచ్చే వార్త. మండువేసవిలో ధనాధన్ ఐపీఎల్‌తో ఇప్పటికే సేదతీరుతున్న అభిమానులకు చాంపియన్స్ ట్రోఫీ రూపంలో మరో మెగా టోర్నీ అలరించేందుకు సిద్ధమవుతున్నది. ప్రపంచంలోని టాప్-8 జట్ల మధ్య జూన్‌లో జరిగే ఈ మినీ వరల్డ్‌కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో భారత్ బరిలోకి దిగుతున్నది. గత కొన్ని రోజులుగా టోర్నీలో మన ప్రాతినిధ్యంపై వస్తున్న వార్తలను పటాపంచలు చేస్తూ.. ఎమ్మెస్కే ప్రసాద్ సారథ్యంలోని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా జట్టును ఎంపిక చేసింది. కొత్త ముఖాలకు ఎవరికి అవకాశం దక్కకపోగా, నిలకడగా రాణిస్తున్న క్రికెటర్లవైపే సెలెక్షన్ కమిటీ మొగ్గుచూపింది. గాయాల కారణంగా జట్టుకు దూరమైన ైస్టెలిష్ బ్యాట్స్‌మన్ రోహిత్‌శర్మ, స్పీడ్‌స్టర్ మహ్మద్ షమీ రీఎంట్రీ ఇచ్చారు.
ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ఆడిన జట్టుకే కమిటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇక జట్టులో చోటుపై ఆశలు పెట్టుకున్న సీనియర్లు గంభీర్, హర్భజన్సింగ్లకు మరోసారి కమిటీ మొండిచేయి చూపింది. అయితే గాయాలు, ఫామ్ ఇతరత్రా కారణాలను దృష్టిలో పెట్టుకుని ఐదుగురితో రిజర్వ్ బెంచ్‌ను ప్రకటించింది. ఇంగ్లండ్ వేదికగా జూన్ 1న చాంపియన్స్ ట్రోఫీ మొదలవనుంది. కోహ్లీ సేన తమ తొలి మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్‌తో 4వ తేదీన, శ్రీలంకతో 8న, దక్షిణాఫ్రికాతో 11న మ్యాచ్‌లు ఆడనుంది.