వర్షాలు తక్కువే.. రాష్ట్రాలూ జాగ్రత్త
- 10 Views
- admin
- May 9, 2017
- జాతీయం తాజా వార్తలు రాష్ట్రీయం
న్యూఢిల్లీ: ఈసారి రుతుపవనాల ఆలస్యం వల్ల వర్షపాతం తక్కువే నమోదు అయ్యే అవకాశాలున్నాయి. ఖరీష్ సీజన్‌కు సగటు వర్షపాతమే ఉంటుందని ఇప్పటికే భారత వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు కొన్ని సూచనలు చేసింది. ఒకవేళ రుతుపవనాల రాక ఆలస్యమైనా, లేక విఫలమైనా, అలాంటి విపత్కర కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాలని కేంద్రం సూచన చేసింది. దీనికి సంబంధించి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ ప్రకటన జారీ చేశారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర మంత్రి రాధా మోహన్ సింగ్ లేఖలు రాశారు. 2016 సంవత్సరం వ్యవసాయ రంగానికి ఆశాజనకంగా ఉన్నా, ఈసారి మాత్రం విభిన్న వాతావరణ పరిస్థితులు ఉత్పన్నమ్యే అవకాశాలున్నాయని ఆ లేఖలో కేంద్ర మంత్రి పేర్కొన్నారు. రుతుపవనాలు విఫలమైతే, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కరువు పరిస్థితిని తట్టుకునేందుకు కాంటిన్జెన్సీ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని మంత్రి సూచించారు. నీటి కరువు తలెత్తకుండా ఉండేందుకు కాంటిన్జెన్సీ ప్రణాళికలు అవసరమన్నారు. ప్రతి జిల్లా వ్యవసాయ శాఖ ఈ ప్రణాళికలు సిద్ధం చేసుకోవానల్నారు. నీటి సంరక్షణ, వ్యవసాయ మౌలికసదుపాయాల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వాలు సమీక్ష నిర్వహించాలన్నారు. కరువు సమీక్షా కోసం ఆయా రాష్ట్రాలు విపత్తు నిర్వహణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. పీఎం పంట బీమా పథకాన్ని విస్తరింపచేయాలని కేంద్ర మంత్రి ఆయా రాష్ట్రాలకు సూచించారు.


