ఈ వృద్ధ దంపతులకు..హేట్సాప్
- 10 Views
- admin
- May 11, 2017
- Home Slider తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
ఇండియన్ ఆర్మీకి కోటి రూపాయలు విరాళంగా అందచేసిన వైనం
అనకాపల్లి, ఫీచర్స్ ఇండియా : రూపాయలకు కక్కుర్తి పడుతున్న రోజులివి…..ఆస్తుల కోసం రక్త సంబంధాన్ని మరచి కొట్టుకు చస్తున్న రోజులివి…..మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలైన ఈ రోజుల్లో తమ జీవితకాల సంపాదనను దేశం కోసం పోరాడుతున్న ఇండియన్ ఆర్మీకి ధారపోసిన ఒక వృద్ద దంపతుల ఆశయానికి దేశవ్యాప్తంగా ప్రసంశల జల్లు కురుస్తుంది. ఢిల్లీకి చెందిన ఒక సీనియర్ సిటిజన్, రిటైర్డు బ్యాంకు ఉద్యోగి జనార్ధన్ భాయ్ భట్ ఇటీవల పదవీ విరమణ చేశారు. స్వతహాగా ఈయనకు మన దేశం పట్ల అవాజ్యమైన ప్రేమ. దేశ సరిహద్దుల్లో పోరాడుతూ ప్రాణాలు విడుస్తున్న సైనికుల కధనాలు పత్రికలలో చదివి కదిలిపోయేవారు. దేశం కోసం ప్రాణాలు అర్పించడం ద్వారా మనిషిగా వారి జన్మ సార్ధకమైందని, దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించే అదృష్టం అందరికీ దక్కదని భార్య పద్మాబెన్తో తరచుగా చెబుతుండేవారు. తను కూడా దేశం కోసం ఏదైనా చేస్తే బాగుండునని ఆలోచిస్తుండేవారు. తమకు ఎలానూ వారసులు లేరు. తమ జీవితకాల సంపాదనను దేశం కోసం వెచ్చిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనను భార్యతో పంచుకోవడం ఆమె సమ్మతించడంతో ఈనెల 8న తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా తమ నిర్ణయాన్ని బ్యాంకు అధికారులకు తెలియచేశారు. సుమారు కోటి రూపాయలను విరాళంగా అందిస్తున్న ఈ వార్త విని బ్యాంకు అధికారులు విస్మయం వ్యక్తం చేసి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చారు. సోషల్ మీడియాలో దుమారం సృష్టించిన ఈ సంఘటన ఎట్టకేలకు ప్రధాని మోడీ దృష్టికి చేరింది. వృద్ద దంపతులను స్వయంగా కలసి అభినందనలు తెలియచేయడానికి ఏర్పాట్లు చేయాలంటూ ప్రధాని అధికారులను ఆదేశించారు. మానవత్వం కనుమరుగు అయిపోతున్న ఈ రోజుల్లో జీవితకా ల సంపాదనను ధారపోసిన ఈ సంఘటన ఎందరికో స్ఫూర్తి. కోట్లు కూడబెట్టిన వారికి సైతం దొరకని ఆత్మసంతృప్తి ఈ మద్యతరగతి జంటకు దక్కడం, జీవిత చరమాంక కాలంలో డబ్బు అవసరం చాలా ఉంటుందని తెలిసికూడా తమకు ఉన్నది ధారపోయడం వీరి మహోన్నత వ్యక్తిత్వానికి ప్రతి ఒక్కరూ జోహార్లు అర్పించక తప్పదు. మానవత్వం పరిమళించిన ఈ వృద్ద దంపతులకు మనం కూడా హేట్సాప్ చెబుదాం.


