వారెవ్వా ఏం ఆట.. మొన్న శామ్సన్.. నిన్న రిషబ్.. నేడు శ్రేయస్. ఒకర్ని మించి మరొకరు తమ బ్యాటింగ్ ప్రతిభతో ఈ సీజన్ ఐపీఎల్‌కే వన్నె తెచ్చారు. భవిష్యత్ భారతాన్ని మన కండ్లముందు ఆవిష్కరిస్తూ వీళ్లు చేసిన పోరాటం ఆద్యంతం ఆకట్టుకున్నా… ఢిల్లీని ప్లే ఆఫ్‌నకు చేర్చలేదనే ఒకే ఒక్క లోటు స్పష్టంగా కనిపిస్తున్నది. గత నాలుగు మ్యాచ్‌ల్లో ఢిల్లీ రెండుసార్లు తక్కువ స్కోరు (66, 67)కే ఔటైనా.. రెండు మ్యాచ్‌ల్లో మాత్రం భారీ స్కోరు (186, 209)ను ఛేదించారు. తాజాగా శ్రేయస్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్
ఆవిష్కరించడంతో మూడోసారి మరో భారీ లక్ష్యాన్ని (196) ఛేదిస్తూ జహీర్సేన గుజరాత్‌ను చిత్తు చేసింది.
కాన్పూర్: ప్లే ఆఫ్‌కు దూరమైన రెండు జట్ల మధ్య జరిగిన పోరాటంలో ఢిల్లీ పైచేయి సాధించింది. శ్రేయస్ అయ్యర్ (57 బంతుల్లో 96; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నా.. లక్ష్య ఛేదనలో కీలక పాత్ర పోషించడంతో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ 2 వికెట్ల తేడాతో గుజరాత్‌పై నెగ్గింది. ముందుగా గుజరాత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 195 పరుగులు చేసింది. ఫించ్ (39 బంతుల్లో 69; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), దినేశ్ కార్తీక్ (28 బంతుల్లో 40; 4 ఫోర్లు, 1 సిక్స్), ఇషాన్ కిషన్ (25 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. తర్వాత ఢిల్లీ 19.4 ఓవర్లలో 8 వికెట్లకు 197 పరుగులు చేసింది. కరుణ్ నాయర్ (15 బంతుల్లో 30; 5 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. శ్రేయస్ అయ్యర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.