ముంబయి: ప్రపంచ వ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టించిన వాన్నాక్రై బ్యాంకింగ్ నెట్‌వర్క్‌ను తాకకుండా ఆర్బీఐ చర్యలు చేపట్టింది. మాల్వేర్ నుంచి రక్షించేందుకు విండోస్ అప్డేషన్ వచ్చే వరకు ఏటీఎంలను మూసివేయాలని ఆదేశాలు జారీచేసింది. దీని ప్రభావంతో దేశవాప్తంగా భారీగా ఏటీఎంలు మూతపడనున్నాయి. దేశంలో దాదాపు అన్ని ఏటీఎంలు విండోస్ ఆధారిత సాఫ్ట్‌వేర్‌తోనే పనిచేస్తున్నాయి. వీటిల్లో 60శాతం అంటే 2.25లక్షల ఏటీఎంలు అవుట్‌డేటెడ్ విండోస్ ఎక్స్‌పీపైనే అధారపడుతున్నాయి. ప్రస్తుతం మాల్వేర్ వ్యాపించిన నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ విండోస్ ఎక్స్పీ కూడాప్రత్యేకమైన అప్డేట్ ఇస్తానని ప్రకటించింది.ఈ నేపథ్యంలో బ్యాంకులు అత్యవసరంగా విండోస్ ప్యాచ్‌లను అప్డేట్ చేసుకోవాలని ఆర్బీఐ సూచించింది. దీంతో బ్యాంకులు తమ సర్వీసు ప్రొవైడర్లకు ఆదేశాలను జారీ చేశాయి. మరో దీనిపై భయపడాల్సిన పనిలేదని ఏటీఎం అపరేటర్లు చెబుతున్నారు. ఏటీఎం యంత్రాల్లో ఎటువంటి డేటా నిల్వ చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి వాన్నక్రై బారిన పడే అవకాశం ఉండదని చెబుతున్నారు. ఒక వేళ ఏటీఎం యంత్రాలు వాన్నాక్రై బారిన పడినా రీఫార్మాట్ చేసి వాడుకోవచ్చని ఎలక్ట్రానిక్స్ పేమెంట్స్ అండ్ సర్వీసెస్ సాంకేతిక విభాగం అధ్యక్షుడు మనోహర్ బోయ్ చెబుతున్నారు. ఈ సంస్థ పబ్లిక్ సెక్టార్ బాంకుల ఏటీఎంలను నిర్వహిస్తోంది.