ఘనంగా మోదకొండమ్మ ఉత్సవాలు
- 62 Views
- admin
- May 15, 2017
- తాజా వార్తలు రాష్ట్రీయం స్థానికం
(పాడేరు, ఫీచర్స్ ఇండియా) : గిరిజన ప్రజల ఆరాధ్య దైవం పాడేరు మోదకొండమ్మ అమ్మవారి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పాడేరులో కొలువుదీరిన అమ్మ వారి మొక్కులు తీర్చేందుకు భక్తు లు ఘటాలను సిద్దం చేశారు. మూడు రోజుల ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు ఆదివారం ఉదయం స్థానిక ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఉత్సవ కమిటీ సభ్యులు ఘటాలను మోస్తూ వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున గిరిజన సంక్షేమ శాఖా మంత్రి ఆనంద బాబు హాజరయ్యారు. గిరిజన సంప్రదాయ వాయుద్యాలను మ్రోగించి ఉత్సవాలను ప్రారం భించారు. ఈ దశలో పెద్ద సం ఖ్యలో భక్తులు ఆది, సోమవారా ల్లో అమ్మవారి దర్శించుకున్నారు. మూడో రోజూ నాలుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తారన్న భావంతో చాలా మంది ఆదివారం నాడే మొక్కులు తీర్చుకున్నారు. ప్రధాన ఆలయ సందర్శనకు ముంద మోదాపల్లిలోని అమ్మవారి పాదాల వద్ద పసుపు కంకుమలు సమర్పించారు. నైవేద్యాలు సమర్పించారు. దీంతో మోదాపల్లి, పోతురాజుగుడి పరిసరాల్లోని కాఫీ తోటలు భక్తులతో నిండిపోయాయి. చాలా మంది అక్కడే వంటలు చేసుకుని కుటుంబాలతో గడపటం కనిపింది. లక్షలాది మంది భక్తులు తరలివస్తున్న దశలో ఐటీడీఎ
అధికారులు విస్త్రత ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ పథకాలను వివరిస్తూ స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ఐటీడీఎ పాడేరు, సీతంపేట పీవో లు రవి సుభాష్, శివశంకర్ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ ధలో ఆర్టీసీ విశాఖ నుంచి ప్రత్యేక సర్వీసులను ప్రారంభించింది. కాగా కొన్ని బస్సుల సామర్థ్యం సక్రమంగా లేక ప్రయాణీకులు అవస్థలు పడటం కనిపించింది.
అడుగడుగునా పోలీసు తనిఖీలు
మోదకొండమ్మ అమ్మవారి ఉత్సవాల నేపథ్యంలో పాడేరు ఘాట్ రోడ్డులో అసాధారణ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అడుగడునా ప్రత్యేక పోలీసు విభాగం తనిఖీలు చేపట్టింది. బాంబు స్క్వాడ్ కల్వర్టుల వద్ద తనిఖీలు నిర్వహించారు. అలాగే ఆలయ ప్రాంగణంతో పాటు ఇతర ప్రదేశాల్లో కూడా భద్రతా బలగాలు మోహరించాయి. పొరుగు జిల్లాల నుంచి పోలీసులను రప్పించారు. ప్రధానంగా ఉత్సవాల వేళ ఏదో ప్రాంతంలో మావోలు అలజడి స్రుష్టించడం గతంలో జరిగింది. పాడేరులో అలాంటి ఘటనలు లేకున్నా ముందస్తుగా మాత్రం పోలీసులు భారీగానే మోహరించారు.


